హైదరాబాద్​లో నీటి కొరత సృష్టిస్తే..వేటు తప్పదు

హైదరాబాద్​లో నీటి కొరత సృష్టిస్తే..వేటు తప్పదు
  •     ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు 
  •     నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి 
  •     మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సూచన  
  •     వాటర్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశం
  •     ముగ్గురు లైన్ మెన్లను సస్పెండ్ చేసినం: వాటర్ బోర్డు ఎండీ
  •     మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులిచ్చామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ​హైదరాబాద్​లో నీటి కొరత సృష్టించేలా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ​శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ​వార్నింగ్ ఇచ్చారు. లైన్​మెన్లు, వర్క్​ఇన్​స్పెక్టర్లు మాత్రమే కాదు జీఎం, డీజీఎం స్థాయి అధికారులెవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సిటీలో నీటి సరఫరాలో కొందరు ఉద్యోగులే కావాలని ఆటంకాలు సృష్టిస్తున్నారనే ప్రచారంపై ఆయన స్పందించారు. శనివారం వాటర్​బోర్డు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇందులో వాటర్ ​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొనగా.. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ల బుకింగ్స్, డెలివరీ, లైన్ మెన్ల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని దానకిశోర్ ఆదేశించారు. లైన్ మెన్లు ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు సృష్టిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. వాటర్ బోర్డు యాప్ లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు మస్ట్ గా నమోదు చేయాలని సూచించారు. సరఫరా వేళలు, నాణ్యతలో తేడా వస్తే బాధ్యులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

అవాంతరాలు రావొద్దు..  

తాగునీటి సరఫరాలో అవాంతరాలు రావొద్దని, ట్యాంకర్ల కొరత కూడా లేకుండా చూడాలని అధికారులకు దానకిశోర్ సూచించారు. భవిష్యత్ అవసరాల మేరకు నీటిని శుద్ధి చేసేందుకు మీరాలం, ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ వంద శాతం పని చేసేలా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే బోర్డు పరిధిలో 750 ట్యాంకర్ల ద్వారా రోజుకు 7 వేల ట్రిప్పుల వరకు నీటి సరఫరా జరుగుతున్నదని అధికారులు వివరించారు. 

మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్యాంకర్ డెలివరీ సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దానకిశోర్​ సూచించారు. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లతో పాటు త్వరలో రానున్న వంద ట్యాంకర్లను సమర్థంగా వాడుకుని డెలివరీ టైమ్ ను 12 గంటలకు తగ్గించాలని పేర్కొన్నారు. 750 ట్యాంకర్లతో పాటు అదనంగా 5 కేఎల్ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు సరఫరా చేసేందుకు 2.5 కేఎల్(రెండున్నర వేల లీటర్ల కెపాసిటీ) సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉండే ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్స్, పాయింట్స్ ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ బోర్డు పరిధిలో 13 లక్షల మందికి పైగా వినియోగదారులుంటే, అందులో 31 వేల మంది మాత్రమే ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. సిటీలో నీటి సమస్య ఉందంటూ వచ్చే ఫేక్​ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు.  

ఎమర్జెన్సీ పంపింగ్​కు ఏర్పాట్లు..  

నాగార్జునసాగర్ లో ఎమర్జెన్సీ పంపింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు దానకిశోర్ ​తెలిపారు. ఈ నెల15 తర్వాత పంపింగ్ చేసే చాన్స్ ఉందన్నారు. సిటీలో ప్రైవేటు ట్యాంకర్ల వివరాలు సేకరించాలని ఆదేశించగా.. అందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు మంచి ఆదరణ వస్తున్నదని తెలిపారు. 

ముగ్గురు లైన్ మెన్ల సస్పెన్షన్..  

క్షేత్రస్థాయిలో సరిగా నీటి సరఫరా చేయకుండా ప్రజలను  ఇబ్బందులకు గురిచేస్తున్న ముగ్గురు లైన్ మెన్లను సస్పెండ్ చేసినట్టు వాటర్ బోర్డ్ ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.  మరో ఏడుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు. రోజుకు 7 వేల ట్యాంకర్ల నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. సిటీలో 30 వేల ఇండ్ల నుంచే వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.