క్రెడిట్ కార్డ్ బిల్లులు కడ్తలేరు.. ఒక్క ఏడాదిలోనే రూ.34 వేల కోట్లు బకాయిలు

క్రెడిట్ కార్డ్ బిల్లులు కడ్తలేరు.. ఒక్క ఏడాదిలోనే రూ.34 వేల కోట్లు బకాయిలు

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులు చాలా మందిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. క్రెడిట్​రేటింగ్​ఏజెన్సీ సీఆర్​ఐఎఫ్ హై మార్క్ డేటా ప్రకారం, 91 నుంచి 360 రోజుల ఓవర్​డ్యూ ఉన్న క్రెడిట్ కార్డు బకాయిలు కేవలం ఒక్క సంవత్సరంలో 44శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి కార్డుహోల్డర్లు దాదాపు రూ. 34 వేల కోట్ల బకాయిలను చెల్లించాలి.  మూడు నెలలు గడుస్తున్నా వీళ్లు బిల్లులు కట్టడం లేదు.  దీర్ఘకాలంగా చెల్లించని బకాయిలు  మొండిబాకీల (ఎన్​పీఏలు) కేటగిరీలోకి చేరుతాయి. 

చాలా మంది తమ క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారని లేదా చెల్లించకూడదని నిర్ణయించుకుంటున్నారని సీఆర్​ఐఎఫ్ తెలిపింది. ఎక్కువ మంది 91–-180 రోజుల ఓవర్​డ్యూ పరిధిలో ఉన్నారు. ఈ విభాగంలో బకాయిల మొత్తం రూ. 29,983.6 కోట్లకు పెరిగింది. గతేడాది వీటి విలువ రూ. 20,872.6 కోట్లు ఉంది. రెండు సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇది మరింత ఎక్కువగా ఉంది. కంపెనీలు ఇచ్చిన లోన్ల రిస్కును కొలిచే పోర్ట్‌‌ఫోలియో ఎట్ రిస్క్ (పీఏఆర్) కూడా పెరుగుతోంది. 

91-–180 రోజులు బకాయి ఉన్న కార్డులకు, పీఏఆర్ ఈ ఏడాది మార్చిలో 8.2శాతానికి పెరిగింది. ఒక సంవత్సరం ముందు ఇది 6.9శాతంగా ఉంది. 181–-360 రోజుల బకాయిలకు ఇది 2024లో 0.9శాతం  ఉంది.  క్రెడిట్​కార్డుల బకాయిలు చెల్లించకపోతే 42శాతం నుంచి 46శాతం వరకు వడ్డీ (ఏడాదికి) కట్టాలి. బకాయిలు పేరుకుపోతుండటంతో ఆర్‌‌బీఐ క్రెడిట్ కార్డు లోన్ల రిస్క్ వెయిట్‌‌ను పెంచింది. బ్యాంకులు వాటిని జారీ చేయడానికి రూల్స్‎ను కఠినంగా మార్చింది.

తగ్గని వాడకం 

బకాయిలు పెరుగుతూనే ఉన్నప్పటికీ,  క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా ఉంది. ఈ ఏడాది మే  నాటికి, మొత్తం క్రెడిట్ కార్డు బకాయిల విలువ రూ. 2.90 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది క్రితం వీటి విలువ రూ. 2.67 లక్షల కోట్లు ఉంది. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి, క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 21.09 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాది లెక్కన ఇది 15శాతం పెరిగింది. కేవలం మే నెలలోనే భారతీయులు రూ. 1.89 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు చేశారు.

 జనవరి 2021లో ఇది కేవలం రూ. 64,737 కోట్లు మాత్రమే. యాక్టివ్​ క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే నాటికి మనదేశంలో 11.11 కోట్ల కార్డులు ఉండగా, 2024లో 10.33 కోట్లు,  జనవరి 2021లో కేవలం 6.10 కోట్ల కార్డులు ఉన్నాయి.  బ్యాంకులు  ఫిన్‌‌టెక్ సంస్థలు క్యాష్‌‌బ్యాక్, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు, ఉచిత లాంజ్ యాక్సెస్,  నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో జనాన్ని ఊరిస్తున్నాయి.  దీంతో క్రెడిట్ కార్డుల వాడకం రోజువారీ వ్యవహారంగా మారింది.