జూన్ 1 వచ్చేసింది. క్రెడిట్ కార్డుల ఖర్చుల లెక్కలను మార్చేసింది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిలో అందరినీ ఎక్కువగా టెన్షన్ పెడుతున్నది మాత్రం క్రెడిట్ కార్డ్ రూల్స్ చేంజెస్. ఎందుకంటే లక్షలాది మంది కార్డ్ యూజర్లు రోజువారీ వాడే యుటిలిటీ బిల్లులు, రెంట్, ఫ్యూయల్, ఇన్సూరెన్స్ పేమెంట్లపై వచ్చే రివార్డ్ పాయింట్లు, ఛార్జీలు పూర్తిగా మారిపోయాయి. నేటి నుంచి వచ్చిన మార్పులు ఎలాంటి ప్రభావం కలిగి ఉంటాయనే వివరాలు, ఏయే బ్యాంకుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ఈ క్రేజీ స్టోరీలో చూద్దాం..
కోటక్ మహీంద్రా బ్యాంక్:
దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఇకపై యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, రెంట్, ఇన్సూరెన్స్ ఖర్చులపై వచ్చే రివార్డ్ పాయింట్లపై బ్యాంక్ సరికొత్త లిమిట్ పెట్టింది తెలుసుకోండి. అంతేకాదు పాత పాయింట్ల రిడెంప్షన్ వాల్యూని కూడా తగ్గించేసింది. రెంట్, ఎడ్యుకేషన్ పేమెంట్లపై ఇక నుంచి ఫ్లాట్ 1% ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. వాలెట్లోకి డబ్బు లోడింగ్, ఆన్‌లైన్ గేమింగ్, ఫ్యూయల్, యుటిలిటీ బిల్లులపై లిమిట్ దాటితే 1% ఫీజు అదనం. అయితే వైట్ రిజర్వ్, ఇన్ఫినిట్, మింత్రా వంటి కొన్ని ప్రీమియం కార్డులకు ఫ్యూయల్ ఛార్జ్ మినహాయింపు ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
వన్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుపై ఒకవేళ బిల్లు కట్టడం లేట్ అయితే.. అన్‌పెయిడ్ బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును ప్రతి నెలా 3.49% నుంచి 3.75%కి పెంచేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ రూల్ జూన్ 23 నుంచి అమలు కానుంది.
ఐసీఐసీఐ బ్యాంక్:
క్రెడిట్ కార్డుతో రెంట్ కట్టే వారికి షాక్. జూన్ 18 నుంచి పాపులర్ అమెజాన్ పే క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పేమెంట్స్ చేస్తే వచ్చే 1% రివార్డ్ పాయింట్ బెనిఫిట్‌ను బ్యాంక్ నిలిపివేస్తోంది.
HDFC బ్యాంక్:
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూన్ 25 నుంచి చిన్న చిన్న ట్రాన్సాక్షన్లకు SMS అలర్ట్స్ పంపడం బంద్ చేస్తోంది. ఇకపై కేవలం యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు రూ.100 దాటితే, రిసీవ్ చేసుకున్నప్పుడు రూ.500 దాటితేనే మెసేజ్ వస్తుంది ఖాతాదారులకు. మిగిలిన అన్ని చిన్న లావాదేవీల అప్‌డేట్స్ కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే అందుతాయి.
బ్యాంకుల ఖర్చులు తగ్గించుకోవడానికి తెచ్చిన ఈ మార్పుల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే.. వెంటనే పాత బకాయిలు క్లియర్ చేయండి. రివార్డ్ పాయింట్లను త్వరగా వాడేయండి. కార్డు వాడేముందు ఒకసారి బ్యాంక్ యాప్‌లో లేటెస్ట్ రూల్స్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి.
