చిన్న పట్టణాల్లో, నగరాల్లో.. క్రెడిట్ కార్డుల జోరు..రూపే కార్డులతో మరిన్ని లావాదేవీలు

చిన్న పట్టణాల్లో, నగరాల్లో..  క్రెడిట్ కార్డుల జోరు..రూపే కార్డులతో మరిన్ని లావాదేవీలు
  • ఆదాయాల పెరుగుదలే కారణం
  • రూపే కార్డులతో మరిన్ని లావాదేవీలు 
  • ప్రస్తుతం దేశంలో 11 కోట్ల కార్డులు
  • కస్టమర్లలో 77% మంది చిన్న పట్టణాల వాళ్లే
  • ఎస్​బీఐ కార్డ్ రిపోర్ట్ వెల్లడి

న్యూఢిల్లీ:  ఆదాయాలు, డిజిటల్​ పేమెంట్స్​పై అవగాహన, పట్టణీకరణ.. చిన్న నగరాల్లో, పట్టణాల్లో ఈ మూడూ పెరగడం వల్ల క్రెడిట్​కార్డుల కంపెనీలు లాభపడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో క్రెడిట్ కార్డుల వాడకం ఊపందుకుంది. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ తో అనుసంధానించే సదుపాయం, ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండటంతో లావాదేవీలు దూసుకెళ్తున్నాయని ఎస్​బీఐ కార్డ్ రిపోర్ట్​ వెల్లడించింది. దీని ప్రకారం.. చిన్న నగరాల కస్టమర్లు రోజువారీ ఖర్చుల కోసం కూడా క్రెడిట్ కార్డులను విరివిగా వాడుతున్నారు.  యూపీఐ కార్డు కస్టమర్లలో దాదాపు 77 శాతం మంది టైర్– 2, టైర్–3 నగరాల వాళ్లే ఉన్నారు. 

ఎమర్జింగ్ మార్కెట్లలో డిజిటల్ క్రెడిట్ విస్తరణకు, ఆర్థిక చేరికకు క్రెడిట్ కార్డులు కీలకంగా మారాయి.  గత పదేళ్లలో మధ్యతరగతి కోరికలు పెరగడం వల్ల ఖర్చులూ ఎక్కువ అయ్యాయి. ప్రస్తుతం 11.86 కోట్ల క్రెడిట్ కార్డులు వాడకంలో ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల లావాదేవీల విలువ రూ.23.62 లక్షల కోట్లు దాటడం విశేషం. రిటైల్ ఖర్చులు మునుపెన్నడూ లేని విధంగా రూ.3.54 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ. రిటైల్ ఖర్చులలో ఆన్‌‌లైన్ వాటా దాదాపు 62.5 శాతంగా ఉంది.  నిత్యావసరాలు,  డిజిటల్ కొనుగోళ్లకు కార్డులను ఎక్కువగా వాడుతున్నారు. 

రూపే కార్డుల హవా

యూపీఐ లింక్​డ్ రూపే​ క్రెడిట్ కార్డులు రోజువారీ లావాదేవీలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2026 నాలుగో క్వార్టర్లో  ఎస్​బీఐ కార్డ్ యూపీఐ  క్రెడిట్ కార్డు హోల్డర్ల ఖర్చులు త్రైమాసిక ప్రాతిపదికన 10 శాతానికిపైగా పెరిగాయి. డిపార్ట్‌‌మెంటల్ స్టోర్లు, కిరాణా సామగ్రి, యుటిలిటీస్, ఇంధనం, దుస్తులు, రెస్టారెంట్లు వంటి విభాగాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈఎంఐ మొత్తాలు కూడా గత ఏడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధించాయి. గ్యాడ్జెట్లు, వినియోగదారు వస్తువులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం కస్టమర్లు ఈఎంఐ పద్ధతిని ఎంచుకుంటున్నారు. 

నో కాస్ట్​ఈఎంఐ, క్యాష్​బ్యాక్​లు, స్పెషల్​ ఆఫర్లూ వీటి వాడకాన్ని పెంచుతున్నాయి. ప్రయాణాల కోసం ఎస్​బీఐ కార్డ్ మైల్స్, వెల్‌‌నెస్ కోసం ఎస్​బీఐ కార్డ్ పల్స్, ఇంధనం కోసం బీపీసీఎల్ ఎస్​బీఐ కార్డ్, జీవనశైలి ఖర్చుల కోసం ఫ్లిప్‌‌కార్ట్ ఎస్​బీఐ కార్డ్, డిజిటల్ లావాదేవీల కోసం ఫోన్‌‌పే ఎస్​బీఐ కార్డ్ వంటి కేటగిరీ ఆధారిత కార్డులను ఉపయోగిస్తున్నారు.