
ఇటీవల సుప్రీంకోర్టులో దళిత, గిరిజనుల రిజర్వేషన్లలో క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి)ని తీసుకురావాలని ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన పిటిషనర్లు సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. రిజర్వేషన్లు పొందే వర్గాల్లో ఆర్థికంగా నిలదొక్కుకున్న వారే లబ్ధి పొందడం వల్ల, అట్టడుగు స్థాయిలోని వారికి ఎదిగే అవకాశమే రావడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అందరికీ సమానమైన, న్యాయమైన రిజర్వేషన్లు దక్కేందుకు విధానాలు తీసుకురావాలని వారు కోరారు.
ఓబీసీల మాదిరిగా ఆదాయం ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అక్టోబర్ 10లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏడాది సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ తీర్పులో క్రిమీలేయర్ వర్తింపచేయాలని సూచించింది. ఇక్కడ కోర్ట్ ను ఎస్సీ ఉప వర్గీకరణ అడిగితే ఉపవర్గీకరణతోపాటు క్రిమీలేయర్ అనే కత్తిని మెడపై వేలాడదీసింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉప వర్గీకరణ చేయడానికి నియమించిన జస్టిస్ శమీమ్ అక్తర్ కమిషన్ సైతం క్రిమీలేయర్ను సిఫార్సు చేసింది. ఎస్సీ, ఎస్టీలను సంపన్న శ్రేణి కింద వర్గీకరించడం వలన ఆ వర్గాల భావి రిజర్వేషన్లపై ప్రభావం పడనుంది. ఆ కులాల్లో అంతర్గత కలహాలు సృష్టించే ప్రమాదం ఉందని దళిత మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రీమీలేయర్ పరిధిలో ఓబీసీలు
వెనుకబడిన వర్గాలకు వెనుకబాటుతనం ఆధారంగా 27 శాతం రిజర్వేషన్స్ కల్పించారు. ఇవి వారి ఆర్థిక స్థితిగతులతో అనుసంధానించారు. 1992 ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చింది. మొత్తం రిజర్వేషన్లకి 50 శాతం కోటా పరిమితిని విధించింది. దీనితోపాటు క్రీమీలేయర్ విధానాన్ని ప్రతిపాదించింది. అయితే, కొన్ని రాష్ట్రాలు క్రీమీలేయర్ ఉనికిని తిరస్కరించాయి. అయినప్పటికీ 2006లో సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. అప్పుడే ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రీమీలేయర్ విస్తరించడంపై ఆలోచించారు.
కానీ, వారి సామాజిక వెనుకబాటుతనం వలన మినహాయించి, ఇతర వెనుకబడిన కులాలకు వర్తింప చేశారు. క్రీమీలేయర్ తో పొంచి ఉన్న ప్రమాదాన్ని చూస్తే.. క్రీమీలేయర్ ప్రమాణాలను ప్రభుత్వాలు కాలానుగుణంగా మార్చవచ్చు. దీంతో రిజర్వేషన్ లబ్ధిని తొలగించవచ్చు, చేకూర్చవచ్చు. సంపన్న శ్రేణి ఆదాయ ప్రమాణాన్ని 2017లో రూ.8లక్షలుగా సవరించారు.
పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రతి మూడు సంవత్సరాలకు సవరించాలి. కానీ, ఇప్పటివరకు మార్చలేదు. దీంతో చాలామంది ఓబీసీ క్రీమీలేయర్ వర్గాలు రిజర్వేషన్ అవకాశాలకు దూరంగా ఉన్నారని ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ లో క్రీమీలేయర్ ప్రస్తావన చర్చనీయాంశంగా మారింది.
రిజర్వేషన్లకు గండికొట్టే ప్రయత్నం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ తీసుకురావడం ఆదర్శనీయ భావనే. కానీ, ఇందులో ఉన్న లొసుగులు, అశాస్త్రీయత వలన రిజర్వేషన్లు బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రతిభ పేరుతో ఓపెన్ కోటాకు ఇప్పటికీ క్రీమీలేయర్ లేదు. ఆ కోటా కింద సెలెక్ట్ అయిన రిజర్వ్ వర్గాల వారి పిల్లలకు సంపన్న శ్రేణి కింద పరిగణించాల్సి వస్తుంది. దీంతో వారు రిజర్వేషన్ అవకాశాలకు దూరమవుతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఆర్థిక స్థితిని బట్టి కాక సామాజిక వెలివేత ఆధారంగా కల్పించారు. ఆర్టికల్ 335 ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ జాతుల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది. క్రీమీలేయర్ వారి ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది.
సామాజిక వివక్ష పోలేదు
నేటి ఆధునిక యుగంలో ఇప్పటికీ ఒక దళిత ఉద్యోగి, అగ్రకుల ఉద్యోగికి మధ్య వివక్షత కనబడుతోంది. ఆర్థికంగా సమానమైనప్పటికీ సామాజిక వివక్షత తొలగలేదు. ఇది ఒక క్లర్క్ స్థాయి ఉద్యోగి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కొనసాగుతుంది. దళితులు బాగా చదివి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇల్లు అద్దెకు అడిగినప్పుడు, వివాహ విషయంలో కులానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.
దళిత, గిరిజనులు రాజకీయ నాయకులకు వివక్షత తప్పడం లేదు. ఇంకా కులం పేరుతో దాడులు, అవమానాలు జరుగుతున్నాయి. మరోవైపు క్లర్కు, కానిస్టేబుల్, టీచర్ వంటి చిరు ఉద్యోగాలకు సైతం ఈ క్రీమీలేయర్ వర్తించడం వలన తక్కువ ర్యాంకు ఉద్యోగుల పిల్లలు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు అట్టడుగు అణగారిన వర్గాలలో సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్యం కల్పించినది ఈ క్రీమీలేయర్(ఉద్యోగస్తులే) వర్గాలే. క్రీమీలేయర్ వలన విద్యావంతునికి, ఉద్యోగస్తులు మధ్య చిచ్చు మొదలవుతుంది. ఇందులో అగ్రకుల రాజకీయ నాయకులు చొరబడి మరింత సామాజిక వైషమ్యాలను రెచ్చగొడతారు.
ఆర్థికం కాదు.. వివక్షనే కొలమానం
నేడు దేశంలో కులం కేంద్రంగానే రాజకీయాలు, వ్యవస్థలను శాసిస్తున్నారు. ఈ క్రమంలో దామాషా రిజర్వేషన్ల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. రాజ్యాంగం కూడా ఇదే చెబుతున్నది. దీంతో ఇటీవల కుల గణన సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. దీంతో రిజర్వేషన్లు, సామాజిక సంక్షేమంపై విధాన నిర్ణయాల మారాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. 1992 నాటి ఇంద్ర సాహ్నీ తీర్పు ద్వారా నిర్ణయించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితి సవరించాలని ఆందోళనలు మొదలైనాయి. ఈ విధంగా కుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయ ప్రాతిపదికన రిజర్వేషన్ల భావన సామాజిక మినహాయింపుకు దారితీస్తుంది. సమాజంలో మరింత అంతరాలకు కారణమవుతుంది. ఇది రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయానికి విరుద్ధం. సామాజిక వెనుకబాటుతనం, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలపై క్రీమీలేయర్ ప్రయోగం చేస్తే మాత్రం అది అసమంజసం అవుతుంది.
- సంపతి రమేష్ మహారాజ్, సోషల్ ఎనలిస్ట్-