మెదడు లోంచి క్రికెట్‌‌‌‌ బాల్‌‌ సైజ్​ ఫంగస్‌‌

మెదడు లోంచి క్రికెట్‌‌‌‌ బాల్‌‌ సైజ్​ ఫంగస్‌‌
  • 3 గంటలు సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు
  • పాట్నాలో సంఘటన 

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మెదడులో నుంచి క్రికెట్‌‌ బాల్‌‌ సైజులో ఉన్న బ్లాక్‌‌ ఫంగస్‌‌ను డాక్టర్లు తొలగించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్‌‌కు 3 గంటలు సర్జరీ చేసి ఆ ఫంగస్‌‌ను తీసేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అనిల్‌‌ కుమార్‌‌ అనే పేషెంట్‌‌ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే తరచూ మైకంగా ఉండటం, స్పృహ తప్పడం జరుగుతుండటంతో డాక్టర్లు అతన్ని బీహార్‌‌ రాజధాని పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌(ఐజీఐఎంఎస్‌‌)కు రిఫర్‌‌ చేశారు. అక్కడ అనిల్‌‌కు బ్లాక్‌‌ ఫంగస్‌‌ సోకినట్టు, మెదడులో క్రికెట్‌‌ బాల్‌‌ సైజులో ఫంగస్‌‌ ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేసి అతని మెదడులో నుంచి దాన్ని తొలగించారు. ఆపరేషన్‌‌ తర్వాత ఆస్పత్రి మెడికల్‌‌ సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌ మనీశ్‌‌ మండల్‌‌ మాట్లాడుతూ.. ‘ముక్కు ద్వారా అనిల్‌‌ మెదడులోకి బ్లాక్‌‌ ఫంగస్‌‌ చేరింది. అయితే కండ్ల వరకు ఇంకా పాకలేదు. దాని వల్లే అతనికి ప్రాణాపాయం తప్పింది. కండ్లకు కూడా ఏం కాలేదు’ అని చెప్పారు. బీహార్‌‌లో ఇప్పటివరకు 500కు పైగా బ్లాక్‌‌ ఫంగస్‌‌ కేసులు రికార్డయ్యాయి. మే 22న బీహార్‌‌ ప్రభుత్వం బ్లాక్‌‌ ఫంగస్‌‌ను ఎపిడమిక్‌‌ డిసీజ్‌‌గా ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న డయాబెటిస్‌‌ పేషెంట్లు, తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్లకు ఈ ఫంగస్‌‌ ఎక్కువగా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.