AUS vs SL: గర్జించిన కంగారూలు: ఆస్ట్రేలియా చేతిలో లంక ఓటమి

AUS vs SL: గర్జించిన కంగారూలు: ఆస్ట్రేలియా చేతిలో లంక ఓటమి

మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కంగారూలు.. ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నారు. సోమవారం లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మెగాటోర్నీలో ఇది ఆసీస్ జట్టుకు తొలి విజయం కాగా, లంకేయులకు హ్యాట్రిక్ ఓటమి.

గెలవాలన్న కసి లేదు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన శ్రీలంకకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు పతుమ్‌ నిస్సంక (61; 67 బంతుల్లో 8 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (78; 82 బంతుల్లో 12 ఫోర్లు) తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. కానీ, మిడిలార్డర్‌ వైఫల్యంతో ఆ జట్టు 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ నాసిరకపు ఫీల్డింగూ వారిని కాపాడలేకపోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కాదు కదా! గెలవాలన్న కసి లంకేయులలో ఇసుమంతైనా కనిపించలేదు. ఆసీస్ బౌలర్లలో జంపా 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమిన్స్ చెరో రెండు, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీసుకున్నాడు. 

మార్ష్ దంచుడు

మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మిచెల్‌ మార్ష్‌.. ఆది నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డేవిడ్‌ వార్నర్‌ (11), స్టీవ్‌ స్మిత్‌ (0) త్వరగా పెవిలియన్ చేరినా.. మార్ష్‌-లబూషేన్‌ జోడి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మార్ష్‌ వెనుదిరగాక.. క్రీజులోకి వచ్చిన జోష్‌ ఇంగ్లిస్‌ (58; 58 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అదే జోరు కొనసాగించండంతో ఆసీస్.. 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన లంకకు సెమీస్ దారులు దాదాపు మూసుకుపోయాయి.