AFG vs ENG: ఇంగ్లాండ్ చేసిన తప్పు అదే.. బంతి చేతిలో ఉన్నప్పుడే అంచనా వేయాలి: సచిన్

AFG vs ENG: ఇంగ్లాండ్ చేసిన తప్పు అదే.. బంతి చేతిలో ఉన్నప్పుడే అంచనా వేయాలి: సచిన్

ఏకపక్షంగా ముగస్తుందనుకున్న ఇంగ్లాండ్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎలాంటి ఫలితాన్ని అందించిందో మనందరం చూశాం.. ఆఫ్ఘన్ స్పిన్‌ త్రయం ముజీబ్‌ ఉర్ రెహ్మాన్, రషీద్‌ ఖాన్, మహమ్మద్ నబీల సుడులు తిరిగే బంతులకు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. బంతి ఎటు పడుతుందో.. ఎటు తిరుగుతుందో అర్థంకాక పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. ఫలితంగా వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఆఫ్ఘన్ జట్టు రెండో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు.

285 పరుగుల లక్ష్యం..

ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ముగిసేవరకూ మ్యాచ్ ఇంగ్లాండ్ పక్షానే ఉంది. బెయిర్ స్టో, మలన్, రూట్, బట్లర్, బ్రూక్, లివింగ్ స్టోన్ వంటి విధ్వంసకర బ్యాటర్ల ముందు 285 పరుగుల లక్ష్యం ఏం సరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలైన కాసేపటికే మ్యాచ్ ఏదో జరగబోతోంది అనిపించింది. బజ్‌బాల్ వీరులను ఒక్కొక్కరిగా పెవిలియన్ చేర్చిన ఆఫ్ఘన్లు.. సగం దారిలోనే మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆల్ రౌండ్ ప్రదర్శనను మెచ్చుకున్న సచిన్.. ఇంగ్లండ్ బ్యాటర్లు చేసిన తప్పిదమేంటో కూడా వెల్లడించారు. 

"అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆఫ్గనిస్తాన్ సమిష్టి విజయాన్ని అందుకుంది. రహ్మనుల్లా గుర్బాజ్ అదరగొట్టాడు. అజ్మతుల్లా మణికట్టు పొజిషన్ చూశాక.. ప్రవీణ్‌కుమార్, భువి గుర్తొచ్చారు. నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు.. బంతి వారి చేతిలో ఉన్నప్పుడే గమనించి అంచనా వేయాలి. ఇది చేయడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. బంతి పిచ్‌పై పడ్డాక రీడ్ చేశారు. ఇదే వారి పతనానికి కారణమైంది. ఇంగ్లండ్‍కు బ్యాడ్ డే.." అని సచిన్ ట్వీట్ చేశారు.

చావో రేవో.. 

ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ జట్టుకు.. ఇకపై ప్రతి మ్యాచ్ చావో రేవో వంటిదే. ఓడితే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టమవుతాయి. బట్లర్ సేన తదుపరి మ్యాచ్ లో వరుస విజయాలతో జోరుమీదున్న సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ  మ్యాచ్ అక్టోబర్ 21న ముంబై, వాంఖడే వేదికగా జరగనుంది.