క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్?

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేయనుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల లిస్టుకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

మెకానికల్ ఇంజినీర్‌ అయిన రీవాబా జడేజా 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలైన ఈమె.. మూడేండ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రముఖ రాజకీయనేత హరి సింగ్‌ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా దానిని నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు, సిట్టింగ్ అభ్యర్థులు, 75 ఏళ్లు దాటినవారిని పక్కనబెట్టనుందని ఆ వర్గాలు తెలిపాయి.

మాజీ సీఎం విజయ్‌ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌కు కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్దిక్‌ పటేల్, అల్పేశ్‌ ఠాగూర్‌ టికెట్లు దక్కించుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీని ఢీ కొట్టేందుకు ఆప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి.