
డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి విడుత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. 160 మంది పేర్లతో కూడిన లిస్టును కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బీజేపీ ప్రకటించిన జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు చోటు దక్కింది. నార్త్ జామ్‌నగర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దింపింది. 2016లో జడేజాను పెళ్లి చేసుకున్న రివాబా... మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రముఖ రాజకీయనేత హరిసింగ్ సోలంకికి ఈమె దగ్గర బంధువు.
ఇక ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన లీడర్లకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. వారిలో విరామ్ గ్రామ్ నుంచి హార్దిక్ పటేల్ పోటీలో ఉన్నారు. మోర్బీ బ్రిడ్జి కూలినప్పుడు నదిలోకి దూకి కొందరిని రక్షించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే కాంతి లాల్ అమృతియాకు టిక్కెట్ కేటాయించింది. ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేష్ మోర్జాకు టిక్కెట్ నిరాకరించింది.
గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 99 సీట్లు గెలిచి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. గుజరాత్ లో ఆప్ కూడా పోటీ చేస్తుండడంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.