ఉప్పల్లో టాప్ స్కోరర్లు వీరే..

ఉప్పల్లో టాప్ స్కోరర్లు వీరే..

న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం నాడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఉప్పల్ స్టేడియం అంటేనే టీమిండియాలో కొందరు ప్లేయర్లకు అచ్చొచ్చిన మైదానం. సొంత గ్రౌండ్ కాకపోయినా..ఉప్పల్ స్టేడియంలో బరిలోకి దిగి పరుగులు వరద పారించారు. 

ఉప్పల్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. అతను ఇక్కడ మూడు మ్యాచులు ఆడి 233 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు సెంచరీలు ఉన్నాయి. యువీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో సచిన్ మూడు మ్యాచులు ఆడి  220 పరుగులు చేశాడు. ఇందులో ఒక భారీ శతకం కూడా ఉంది. 2009లో  ఆస్ట్రేలియాపై  సచిన్ 175 పరుగులు సాధించాడు. 

మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నాడు. ధోని ఇక్కడ 5 మ్యాచులు ఆడాడు.  200 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ మైదానంలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్ ధోని కావడం విశేషం .ధోని తర్వాత ఉప్పల్ స్టేడియంలో  వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రైనా  నాలుగో ప్లేయర్ గా  నిలిచాడు. అతడు 3 మ్యాచుల్లో  138 పరుగులు కొట్టాడు. 

లిస్టులో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు.  కోహ్లీ ఇప్పటి వరకు ఉప్పల్ లో 3 మ్యాచులు ఆడి 134 పరుగులే  చేశాడు. వీరందరిలో  ప్రస్తుతం కోహ్లీ మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ఫస్ట్ వన్డేలో కోహ్లీ సెంచరీ సాధిస్తే  ఉప్పల్ లో  అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ అవతరిస్తాడు.