
- దర్యాప్తులో అధికారుల పాత్ర కీలకం
- భరోసా కేంద్రాల్లో న్యాయం దొరుకుతున్నదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అత్యాచార, పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. నేరాన్ని రుజువు చేసేలా సాక్ష్యాలను కోర్టులకు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది జులై వరకు కోర్టులు విధించిన శిక్షల వివరాలను డీజీపీ ఆఫీస్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 29 మంది నేరస్తులకు శిక్షలు ఖరారైనట్టు డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటున్నదని తెలిపారు.
అధికారుల కృషితోనే శిక్షల సంఖ్య పెరుగుతున్నదని పేర్కొన్నారు. భరోసా కేంద్రాలతో బాధితులకు సహాయం పెరిగిందని చెప్పారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ, పటిష్టమైన దర్యాప్తుతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎంఎస్‌జే కోర్టు ఉరిశిక్ష విధించిందని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. కీలకమైన కేసుల్లో నేరస్తులకు శిక్షలు విధించడంలో భరోసా కేంద్రాలు, దర్యాప్తు, కోర్టు డ్యూటీ అధికారులు, ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకంగా ఉంటున్నదని తెలిపారు. కఠిన శిక్షలతోనే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు.
11 మందికి జీవిత ఖైదు
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అత్యాచారం, పోక్సో కేసుల్లో ఈ ఏడాదిలో ఒకరికి ఉరి శిక్ష, 15 మందికి 20 ఏండ్లు, ఇద్దరికి 25 ఏండ్లు, 11 మందికి జీవిత ఖైదు శిక్షలు విధించినట్లు డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 8 మంది పిల్లలపై వారి తండ్రులే అత్యాచారం చేశారని తెలిపారు. వీరిందరికి జీవిత ఖైదు విధించినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఓ బాలుడిపై అసహజ లైంగిక నేరానికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు తెలిపారు.