శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ కిడ్నాప్ ఆరోపణల్లో నిజమెంత..? 

శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ కిడ్నాప్ ఆరోపణల్లో నిజమెంత..? 

మహారాష్ట్ర రాజకీయాల్లో మూడో రోజు సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పై మంత్రి ఏక్ నాథ్ షిండే, ఆయన అనుచర ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరైన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ షాక్ ఇచ్చారు. తిరిగి ముంబైకి వచ్చి ఉద్ధవ్ ఠాక్రే గూటికి చేరిపోయారు. ఏక్ నాథ్ షిండే బృందం తనను కిడ్నాప్ చేసిందని ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. తమను బలవంతంగా సూరత్‌కు తీసుకెళ్లారని, తాను పారిపోవడానికి ప్రయత్నిస్తే సూరత్ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. తన కంటే ముందే ఎమ్మెల్యే ప్రకాశ్ అబిత్కర్ వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదని అన్నారు. తాము సూరత్‌లోని  లీ మెరిడియన్ హోటల్‌కు చేరుకోగానే ‘మహా వికాస్ అఘాఢీ’ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని తనకు అప్పుడే తెలిసిందని ఆరోపించారు. 

అయితే.. శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ ఆరోపణలను ఏక్ నాథ్ షిండే బృందం తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ ను తాము కిడ్నాప్ చేయలేదని, ఆయన ఇష్టపూర్వకంగానే తమతో వచ్చాడంటూ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. తనను బలవంతంగా సూరత్‌కు తీసుకెళ్లారని ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ చేసిన ఆరోపణలను తప్పుపట్టింది.  నితిన్ దేశ్‌ముఖ్ ను కిడ్నాప్ చేయలేదని, తమతో కలిసి సూరత్ లో ఉన్న కొన్ని ఫొటోలను ఏక్ నాథ్ షిండే బృందం విడుదల చేసింది.