రొనాల్డో ఒప్పందం విలువ రూ. 5,310 కోట్లే..!

రొనాల్డో ఒప్పందం విలువ రూ.  5,310 కోట్లే..!

ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సౌదీ ఆరేబియా క్లబ్ అల్ నాసర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ల యూరో కంటే ఎక్కువ మొత్తానికి రొనాల్డోతో ఒప్పందం చేసుకున్నట్లు సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అల్ నాసర్ ప్రకటించింది. 37 ఏళ్ల రొనాల్డో అల్ నాసర్ క్లబ్ మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. అంటే క్లబ్ తరపున రొనాల్డో  2025 వరకు ఆడతాడు. 

అల్ నాసర్  క్లబ్ తరపున మైదానంలోకి దిగనున్న రొనాల్డో..పసుపు రంగు టీషర్ట్తో కూడిన తన జెర్సీని ఆవిష్కరించాడు.  వెనుక భాగంలో తనకు ఇష్టమైన 7వ నెంబర్ ను ధరించాడు. ఈ సందర్భంగా అల్ నాసర్ క్లబ్ తరపున ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు రొనాల్డో తెలిపాడు. సహచరులంతా కలిసి గొప్ప విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.  

పోర్చుగల్ తరపున ఫిఫా వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో ..మాంచెస్టర్‌ యునైటెడ్‌ అతనితో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్‌ఫైనల్లో పోర్చుగల్ మొరాకో చేతిలో 0-1తో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. వరల్డ్ కప్ తర్వాత అతను ఫ్రీ ఏజెంట్‌గానే ఉన్నాడు. వరల్డ్ కప్ తర్వాత ట్రైనింగ్ ప్రారంభించిన రొనాల్డో..ప్రస్తుతం సౌదీ అరేబియా అల్ నాసర్ తరపున ఆడబోతున్నాడు. 

2009 నుంచి 2018 వరకూ రియల్‌ మాడ్రిడ్‌ తరఫున రొనాల్డో ఆడాడు. రియల్‌ మాడ్రిడ్‌తో రొనాల్డోకు మంచి అనుబంధం కొనసాగింది. ప్లేయర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. డొమెస్టిక్‌, కాంటినెంటల్‌, గ్లోబల్‌ ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక బాలన్‌ డీఓర్‌, ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను పలుమార్లు దక్కించుకున్నాడు. ఇక 2018లో రియల్‌ మాడ్రిడ్‌ను వదిలి జువెంటస్‌ క్లబ్‌కు వెళ్లిన రొనాల్డో...అక్కడి నుంచి తిరిగి తన పాత క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌కు  వచ్చాడు. కేవలం రెండేళ్ల కాల ఒప్పందం రద్దు కావడంతో  ప్రస్తుతం  సౌదీ క్లబ్‌తో డీల్‌ కుదుర్చుకున్నాడు.