అధికారుల సమన్వయ లోపంతో ఆగమవుతున్న స్టూడెంట్లు

అధికారుల సమన్వయ లోపంతో ఆగమవుతున్న స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నైన్త్, టెన్త్ క్లాసు స్టూడెంట్లకు వచ్చే నెల1 నుంచి జరగనున్న సమ్మెటివ్ అసెస్మెంట్–1 ఎగ్జామ్ నిర్వహణలో అధికారులు మళ్లీ మార్పులు చేశారు. ఎస్ఏ1 పరీక్షలు మాత్రం 11 పేపర్లకు ఉంటుందని.. టెన్త్ ప్రీఫైనల్, బోర్డు ఎగ్జామ్స్ ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి బుధవారం ప్రకటించారు. నైన్త్ క్లాస్ స్టూడెంట్లకు ఎస్ఏ–2 (ఆన్వెల్) పరీక్షలు కూడా ఆరు పేపర్లతోనే చేపడతామని వెల్లడించారు. ఈ నెల1 నుంచి పరీక్షలు జరుగుతాయని.. ఉదయంపేపర్1, మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుందని తెలిపారు.

అయితే, ఎస్ఏ1 పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముందుగా 11 పేపర్లతో పరీక్షలు పెడ్తామని చెప్పి.. ఇటీవల ఆరు పేపర్లతోనే పెట్టాలని డీఈఓలకు ఆదేశాలిచ్చారు. కానీ, అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకముందే డీఈఓలు11 పేపర్లను ప్రింట్ చేయించారు. ఆ విషయాన్ని ఎస్సీఈఆర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు డీఈఓలు తెలిపారు. దాంతో అర్థిక భారం దృష్ట్యా  ఎస్ఏ–1 పరీక్షలు ఈ సారికి 11 పేపర్లతో పెట్టాలని బుధవారం నిర్ణయించారు. అధికారుల సమన్వయ లోపంతో స్టూడెంట్లు ఆగమవుతున్నారు. ఆరు పేపర్లతో నిర్వహించాల్సిన ఎస్ఏ 1 పరీక్షలను.. డబ్బులకు కక్కుర్తిపడి స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని టీచర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.