పోలీసుల తీరుపై మొదటినుంచీ విమర్శలే!

పోలీసుల తీరుపై మొదటినుంచీ విమర్శలే!
  • అధికార పార్టీకి ఓ రూల్​..ప్రతిపక్షాలకు మరో రూల్​
  • అక్రమ కేసులు అరెస్ట్​లతో వివాదాస్పదం
  • జిల్లాలో సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ నిఘా
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో నలుగురు ఎస్పీల బదిలీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

మహబూబ్​నగర్​, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పోలీసుల తీరుపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, పాలమూరు, నాగర్​కర్నూల్​ జిల్లాల ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఎస్పీలు కె.సృజన, ఎన్​.వెంకటేశ్వర్లు, కె.నరసింహ, ఎ.మనోహర్​కు ఎలక్షన్​ బాధ్యతలు అప్పగించరాదని రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మరో రెండు డిపార్ట్​మెంట్​లకు చెందిన ఆఫీసర్లపై కూడా చర్యలుంటాయని ఈసీ వార్నింగ్​ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 


 అక్రమ కేసులు, అరెస్టులు..


మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో  కొంత కాలంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లకు సపోర్ట్​ చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. కొందరు రూలింగ్​ పార్టీ లీడర్ల  దురుసు ప్రవర్తనపై బాధితులు కంప్లైంట్​ చేయడానికి స్టేషన్​లకు వెళ్లితే.. తిరిగి బాధితుల మీదనే కేసులు పెడతామని హెచ్చరించి పంపించారనే వార్తలు వచ్చాయి. అపొజిషన్​  లీడర్లను రూలింగ్​ పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం, పార్టీ మారకుంటే పోలీసులను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడడం తదితర  విషయాలపై ఎస్పీలకు చెప్పినా పట్టించుకోలేదని అపొజిషన్​ పార్టీల లీడర్లు కొద్ది రోజుల కిందట ఈసీకి దృష్టికి తీసుకెళ్లారు. 


 సర్కార్​ పక్షానికే సహకారం.. 


ఈ నాలుగు జిల్లాల్లో పోలీసులు రూలింగ్​పార్టీకి ఒక రూల్​, అపొజిషన్​ పార్టీలకు మరో రూల్  అన్నట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.  రూలింగ్​ పార్టీ సభలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే అపొజిషన్​ పార్టీల సభలకు పబ్లిక్​ను రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ప్రతిపక్షాల లీడర్లు విమర్శించారు. దీనికితోడు ప్రతిపక్షాలు, స్టూడెంట్లు, వివిధ రంగాల కార్మికులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే బలవంతంగా అరెస్టులు చేశారు. సీఎం, మంత్రుల పర్యటనలు ఉంటే ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్​కు తరలించి ఇబ్బందులకు గురి చేశారు. రూలింగ్​ పార్టీ లీడర్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాల వల్ల ఇబ్బంది ఏర్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇటీవల  ప్రతిపక్షాల లీడర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు.


మరో రెండు డిపార్ట్​మెంట్లపై కూడా ఆరోపణలు..


రాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న మరో రెండు డిపార్ట్​మెంట్లపై కూడా ఈసీ నిఘా పెట్టింది. కొందరు ఆఫీసర్లు రూలింగ్​పార్టీ లీడర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయి. ఇంటెలిజెన్స్ టీం ఈ రెండు డిపార్ట్​మెంట్లపై కూడా నిఘా పెట్టింది. ఈ టీం ఇచ్చే రిపోర్ట్​ తర్వాత ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 
బుధవారం ఎస్పీలను ట్రాన్స్​ఫర్స్​ చేసిన సమయంలోనే ఈ రెండు డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలని, తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ 
వార్నింగ్​ ఇచ్చింది.

సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ నిఘా..


 ఇక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఈసీ కొద్ది రోజుల కిందట సెంట్రల్ ఇంటెలిజెన్స్​ టీంను రంగంలోకి దింపింది. వీరు ప్రతి నిత్యం జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాల్లో తిరుగుతూ ప్రజలు, అపొజిషన్​ పార్టీల లీడర్లకు  పోలీసులు ఎలా సహకరిస్తున్నారు? రూలింగ్​ పార్టీ లీడర్లతో ఎలా ఉంటున్నారు అనే వివరాలు సేకరించారు. కొద్ది రోజుల కిందట ఈ వివరాలను ఈసీకి అందించారు. దీనితో పాటు ప్రజలు, అపోజిషన్​ లీడర్లు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా రూలింగ్ పార్టీ లీడర్లకు వత్తాసు పలుకుతున్న ఆఫీసర్లను ట్రాన్స్​ఫర్లు చేశారు.