రాష్ట్రాన్ని కేసీఆర్​ దివాలా తీయించిండు: ప్రెసిడెంట్ డీకే అరుణ

రాష్ట్రాన్ని  కేసీఆర్​ దివాలా తీయించిండు: ప్రెసిడెంట్ డీకే అరుణ

గద్వాల, వెలుగు: వేల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాలా తీయించిండని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ మండిపడ్డారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని సద్దనోనిపల్లి, మంగంపేట, అడవి రావుల చెరువు, నేతోనిపల్లి, ఉలిగే పల్లి, బిజ్జారం, మేకల సోంపల్లి, దాసరపల్లి గ్రామాల్లో పర్యటించి పార్టీ జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు. జూటా మాటలతో తొమ్మిదేళ్లు ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. 

 రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ  సర్కారును సాగనంపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు.  నెట్టెంపాడు ప్రాజెక్టును తీసుకువచ్చి గద్వాలలో సస్యశ్యామలం చేసింది తానేనన్నారు. అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తున్నాడన్నారు.  రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు, రాజశేఖర్ రెడ్డి, గోపాల్, నర్సింహులు, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.