రుణమాఫీ కాక బ్యాంకుల నుంచి..రైతులకు నోటీసులు

రుణమాఫీ కాక బ్యాంకుల నుంచి..రైతులకు నోటీసులు

 

  • లోన్లు చెల్లించాలంటూ ఇంటి మీదికొచ్చి ఒత్తిడి 
  • రైతు చనిపోయినా కుటుంబాన్ని వదుల్తలే
  • నాలుగున్నరేండ్లయినా అమలు కాని రూ. లక్ష పంట రుణ మాఫీ హామీ
  • నాలుగు విడతలుగా అని చెప్పి.. ఇప్పటిదాకా మాఫీ చేసింది రూ. 37 వేల లోపు లోన్లే
  • ఇంకా 31 లక్షల మంది  ఎదురుచూపులు
  • ఇప్పటికే  20 లక్షల మంది రైతులను డిఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు

హైదరాబాద్‌‌, వెలుగు:  రైతులకు లక్ష రూపాయల పంట రుణమాఫీ అంటూ సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చి నాలుగున్నరేండ్లు దాటుతున్నా అది అమలైతలేదు. దీంతో.. తీసుకున్న క్రాప్​ లోన్లు తిరిగి కట్టాల్సిందేనని రైతులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. నోటీసులు పంపుతున్నాయి. సాక్షి సంతకాలు పెట్టినోళ్లకు కూడా నోటీసులు ఇస్తున్నాయి. సర్కారు మాఫీ చేస్తుందనుకుని ఇన్నాళ్లూ చెల్లించని రైతులు.. ఆ నోటీసులు చూసి ఆందోళనకు గురవుతున్నారు. ఇటు రుణాలు మాఫీ కాక, అటు తీసుకున్న లోన్​ భారం రెండు మూడు రెట్లు పెరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత లోన్లను వడ్డీలతో చెల్లిస్తే గానీ కొత్త లోన్లు ఇచ్చేది లేదని బ్యాంకు ఆఫీసర్లు తేల్చిచెప్తున్నారు. రైతుల అకౌంట్ల​లో వడ్లమ్మిన పైసలు పడినా వాటిని లోన్ల కింద కట్​ చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే లోన్లు తీసుకున్న వారి లిస్టును పట్టుకొని వాళ్ల ఇండ్లకు బ్యాంకు అధికారులు వెళ్లి ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల జాబితాలో చేర్చాయి.   

మళ్లీ ఎన్నికలు దగ్గరపడ్తున్నా..!

మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతాంగానికి రూ. లక్ష వరకు పంట రుణమాఫీ అమలు చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్​ ప్రకటించారు. దీన్ని మేనిఫెస్టోలోనూ పెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ‘‘ప్రతి రైతు కుటుంబానికి చెందిన పంట రుణాల్లో 2018  డిసెంబర్‌ 11 వరకు ఉన్న రుణాలను లక్ష వరకు వడ్డీతో పాటు మాఫీ చేస్తం” అని మార్గదర్శకాలు విడుదల చేశారు. కానీ, ఇప్పటికీ సగం కూడా మాఫీ చేయలేదు. సర్కారు చెల్లిస్తుందని నమ్మి రైతులు బ్యాంకులకు లోన్ల డబ్బు కట్టలేదు. రుణాలు కట్టి రెన్యువల్‌ చేసుకోవాలని బ్యాంకులు ఒత్తిడితేగా కొందరు అప్పుసప్పు చేసి కట్టి రెన్యువల్‌ చేసుకున్నారు.  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తున్నా ఇంకా రుణమాఫీ అమలు చేయకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటివరకు 6శాతమే మాఫీ

‘2018 డిసెంబర్ 11’ను రుణమాఫీకి కటాఫ్‌ తేదీగా అప్పట్లో సర్కార్ నిర్ణయించింది. రైతులు, వారి కుటుంబసభ్యులపై కలిపి మొత్తంగా రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని తెలిపింది. కటాఫ్ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన రూ. 25,936 కోట్ల లోన్లు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. అయితే.. ఫ్యామిలీకి రూ.లక్ష మాఫీ నిబంధనలతో 3 .98 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసా య శాఖ అంచనా వేసింది. అయితే.. 5.66 లక్షల మంది రైతులకు సంబంధించి రుణాలు మాఫీ చేసింది. ఇందుకు రూ.1,207 కోట్లు ఖర్చు చేసింది. నాలుగున్నరేండ్లలో  6 శాతమే రుణ మాఫీ జరిగింది.  ఇంకా 94 శాతం మాఫీ కాలేదు. 

కుటుంబాలపైనా ఒత్తిడి

క్రాప్​లోన్​ తీసుకున్న రైతులు చనిపోతే.. వాళ్ల కుటుంబాలను కూడా బ్యాంకులు వదలడం లేదు. కట్టాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. జనగామ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు తన పట్టా పాస్‌బుక్‌ పెట్టి బ్యాంకులో రూ.45 వేలు లోను తీసుకుంది. 2019లో ఎల్లమ్మ చనిపోగా ఆమె భూమి మనుమడి పేరు మీద రిజిస్టర్​ అయింది. దీంతో బ్యాంకువాళ్లు చనిపోయిన వృద్ధురాలి లోన్‌ వడ్డీతో కలిపి మొత్తం రూ.85 వేలుగా నిర్ధారించి దాన్ని ఆమె మనుమని పేరుకు మార్చారు.  ఇప్పుడా లోను రూ.1.12 లక్షలైంది. వాటిని తిరిగి చెల్లించాలని బ్యాంకోళ్లు ఒత్తిడి తెస్తున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలోని యూకో బ్యాంకు అఫ్ ఇండియా నుంచి 600 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇదే జిల్లాలోని ఏపీజీవీబీ బ్యాంకు నుంచి 200 మంది రైతులకు నోటీసులందాయి. జిల్లాలోని ప్రతి బ్యాంకు నుంచి అగ్రికల్చర్ క్రాప్ లోన్ రెన్యువల్ చేయని వారికి, 3 ఏండ్లు, ఆ పైబడి పెండింగ్ పెట్టినవాళ్లకు నోటీసులిస్తున్నట్లు బ్యాంకర్లు చెప్తున్నారు. 

డబులైంది

నేను తీసుకున్న క్రాప్​లోన్​ రూ. 70 వేలు. సర్కారు రుణమాఫీ చేస్తుందని ఎదురుచూస్తే.. ఫాయిదా ఉంటలేదు. పాతవి కూడా కలిపి నా లోన్​ డబులైందని బ్యాంకోళ్లు నోటీసులు ఇచ్చిన్రు. కాలు విరిగి అనారోగ్యంతో ఉండి రెన్యువల్​చేసుకోలేదు. రుణమాఫీ చేస్తనని చెప్పిన ప్రభుత్వం..  ఇట్ల అప్పుల పాల్జేసింది.  నేను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకున్నే. కానీ, నాకే ఈ పరిస్థితి ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంది?
  
- కత్రం నాగేందర్‌రెడ్డి, కిష్టాపురం గ్రామం, సూర్యాపేట జిల్లా


ఎన్నికలు వస్తున్నా  ఇంకెప్పుడు చేస్తరు

రూ. 80 వేలు క్రాప్​లోన్​ తీసుకున్న. వడ్డీల రూపంలో ఏటా రూ.10 వేల నుంచి 20 వేల దాకా కట్టుకుంట వస్తున్నం. ఇంకా  రూ. 1.40 లక్షలు కట్టాలంటున్నరు. బ్యాంకోళ్లు ఊర్లల్లకు వచ్చి అప్పు కట్టాలని ఒత్తిడి తెస్తున్నరు. రైతు బంధు డబ్బులు, వడ్లు అమ్మంగ వచ్చిన డబ్బులు కూడా పట్టుకుంటున్నరు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా రుణమాఫీ అమలు చేయకపోవడం ఏంది?  ఇప్పటికైనా  చేయాలి. 

- రావుల గోవిందరెడ్డి, రైతు, వెల్దండ   గ్రామం, జనగామ జిల్లా

వెంటనే చెల్లించాలి

ప్రభుత్వాన్ని నమ్మి రైతులు బ్యాంకు పంట రుణాలు కట్టకపోవడం వల్లే 7శాతం ఉన్న వడ్డీ 14 శాతానికి పెరిగింది. అప్పుల భారం పెరిగి 20 లక్షల మంది డిఫాల్టర్‌లుగా మారారు. బ్యాంకులు నోటీసులు ఇచ్చి రైతులను ఇబ్బంది పెడ్తున్నయ్​.  అసలు, వడ్డీ అంతా ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. 

- అన్వేష్​రెడ్డి, కాంగ్రెస్‌ కిసాన్​ సెల్​ రాష్ట్ర అధ్యక్షుడు

60 వేలు తీసుకుంటే లక్షా 83 వేలైంది!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మంగపేట గ్రామానికి చెందిన రైతు సడియం నాగేశ్వరరావు రూ. 60 వేలు క్రాప్ లోన్ తీసుకున్నడు. ఆయనతో పాటు గ్రామంలోని పలువురు రైతులు రూ. 50 వేల నుంచి 60వేల వరకు లోన్లు పొందారు. రుణ మాఫీ కాకపోవడంతో ఎస్బీఐ నుంచి రైతు నాగేశ్వరరావుతో పాటు మరో 15 మందికి నోటీసులు అందాయి. ఒక్కొక్కరు దాదాపు రూ. 1.50 లక్షల నుంచి 1.85లక్షల వరకు కట్టాలంటూ బ్యాంకోళ్లు నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ. 60వేలు లోన్ తీసుకున్న నాగేశ్వరరావుకు వడ్డీతో పాటు రూ. లక్షా 83 వేల 713 కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసు  పంపారు. 

కేటాయించిన దాంట్లో ఇచ్చింది అంతంతే

రుణమాఫీకి ప్రతి బడ్జెట్ లోనూ సర్కార్ నిధులు కేటాయిస్తున్నది కానీ వాటిని పూర్తిగా రిలీజ్ ​చేయడం లేదు. 2018లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బడ్జెట్లలో మొత్తంగా రూ. 26,549.20 కోట్లు రుణమాఫీ కోసం కేటాయించింది. ఈ నిధులన్నీ విడుదల చేసి ఉంటే, ఈపాటికి రుణమాఫీ పూర్తయ్యేది. కానీ, ఇప్పటివరకు విడుదల చేసింది రూ. 1,207 కోట్లు మాత్రమే. నాలుగు విడతల్లో లోన్లు మాఫీ చేస్తామన్న చెప్పిన ప్రభుత్వం..  రెండు విడతలు కూడా పూర్తి చేయలేదు. 5.66 లక్షల మందికి రుణమాఫీ అమలు కాగా.. ఇంకా 31 లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. 2022 మార్చి 31 నాటికే రూ. 50 వేల లోపున్న రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ. 37 వేల  713 కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసు  పంపారు.