పత్తి పంట పాయే!.. వెదర్​, వైరస్​ ఎఫెక్ట్​తో దెబ్బతిన్న పంటలు

పత్తి పంట పాయే!.. వెదర్​, వైరస్​ ఎఫెక్ట్​తో దెబ్బతిన్న పంటలు
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 లక్షల ఎకరాలపై ప్రభావం
  • సగానికిపైగా పడిపోనున్న దిగుబడులు

మహబూబ్​నగర్​, వెలుగు: పత్తి రైతులు ఆగమైతున్నరు. నిరుడు మంచి రేట్​ రావడంతో ఈ సీజన్​లో రికార్డు స్థాయిలో పంట వేశారు. కానీ, వెదర్​ ఎఫెక్ట్​తో చేలు మొత్తం దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల చేన్లు ఏపుగా పెరిగినా 30 శాతం కాయలు కూడా పట్టలేదు. మరికొన్ని చోట్ల సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోయాయి. దీంతో ఈ పంట సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు.

అనుకూలించని వాతావరణం..

రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగయ్యే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి పరిస్థితి తారుమారైంది. నిరుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా, ఈ సారి కూడా అదే స్థాయిలో సాగవుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ, వర్షాలు లేకపోవడంతో 8 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం ఈ పంటలు ఎదగడం లేదు. మే చివరి వారం నుంచి జూన్​ రెండో వారం వరకు పత్తి విత్తనాలు చల్లినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. అప్పటి నుంచి పత్తి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 

ఆగస్టులో మోస్తరు వర్షాలు పడినా చేలకు జీవం పోయలేదు. బోర్ల ద్వారా నీళ్లు అందిద్దామన్నా గ్రౌండ్​ వాటర్​ పడిపోవడంతో ప్రస్తుతం చేన్లు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, 70 వేల ఎకరాల్లో పత్తికి వైరస్​ సోకింది. ఆకుమాడు, ఎండు తెగులు, సుక్ష్మధాత్రి లోపం, రసం పీల్చే పురుగులు ఆశిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం చెల్క పొలాల్లో పత్తి మొక్కలు రెండు ఫీట్లకు మించి పెరగలేదు. నాగర్​కర్నూల్​ జిల్లాలో 3.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 70 శాతం పంటలు ఎండిపోయాయి. 

వర్షాలు లేకపోవడం, సాగునీటి వనరులు కూడా లేకపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేకపోయారు. నారాయణపేట జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా రైతులు పత్తి సాగు చేయగా, వర్షాలు లేక 30 శాతం పంటలు ఎండిపోయాయి. మరో 40 శాతం పంటలు ఎదుగుదల లేకుండాపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.20 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ప్రస్తుతం రైతులు పత్తిని ఏరుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ జిల్లాలో పత్తి దిగుబడి సగానికి పడిపోయింది.

పత్తి కాయలు లేని చేన్లు

వెదర్​ ఎఫెక్ట్​ వల్ల ఇప్పటి వరకు పాలమూరు, నాగర్​కర్నూల్​, నారాయణపేట జిల్లాల్లో మొక్కలకు ఆశించిన స్థాయిలో పత్తి కాయలేదు. సాధారణంగా ఒక్కో పత్తి మొక్కకు 30 కాయలు పట్టాలి. వాతావరణం అనుకూలిస్తే 50కి పైగానే కాయలు పడతాయి. కానీ, ఈ సీజన్​లో వాతావరణంలో మార్పులు, వైరస్​లు సోకడంతో ఒక్కో మొక్కకు 10 నుంచి 12 కాయలు మాత్రమే పడుతున్నాయి.  కొన్ని మండలాల్లో మొక్కలకు ఇప్పుడిప్పుడు పూత వస్తోంది. మరికొన్ని చోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా పూత లేక బోడగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దిగుబడి మొదలు కావాలి. కానీ, మొక్కలు ఇంకా పూత, కాయ దశలోనే ఉండగా, అక్టోబరు నుంచి చలికాలం మొదలు కానుంది. ఆ టైంలో కాయ నుంచి పత్తి వచ్చినా తేమ పెరిగి 30 శాతానికి మించి దిగుబడి రాదని తెలుస్తోంది.

ఆశలు వదులుకున్న రైతులు..

పత్తి సాగు చేసిన రైతులు ఒక్కో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టగా, అవి చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు పెట్టుబడుల కోసం అప్పులు చేయగా, వాటిని ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి మినహా మిగతా నాలుగు జిల్లాల్లో 30 శాతం నుంచి 50 శాతంలోపు దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో రైతులు పంటలపై ఆశలు వదులుకున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి..

నాకున్న మూడెకరాల్లో పత్తి వేసిన. జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు లేక రెండు ఎకరాలు ఎండిపోయింది. ఉన్న ఎకరా చేనుకు ఇటీవల ఎర్ర తెగులు సోకింది.  ఆకులన్నీ రాలిపోయి బోడగా తయారయ్యాయి. ఈ సారి మొత్తం లాస్​ వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

బాలయ్య, రైతు, మిడ్జిల్

చేనుకు వైరస్​ సోకింది

నాకు ఏడెకరాల పొలం ఉంది. మొత్తం పత్తి వేసిన. మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. వర్షాలు పడ్తలేవు. వాతావరణం అనుకూలిస్తలేదు. దీంతో  చేను మొత్తం వైరస్​ సోకింది. దిగుబడి కూడా వచ్చేటట్లు లేదు. ప్రభుత్వమే ఆదుకొని ఆర్థిక సాయం అందించాలి.

- చెన్నరాయుడు, రైతు, మద్దూరు గ్రామం