ఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్.. గూడెం లిఫ్టు కింద ఎండుతున్న పంటలు

ఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్.. గూడెం లిఫ్టు కింద ఎండుతున్న పంటలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్​ హబ్​గా మారింది. ఇక్కడి నుంచే మిడ్ ​మానేరు మొదలు మల్లన్నసాగర్​ వరకు రివర్స్​ పంపింగ్​ జరిగేది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్​ పంపింగ్​ నిలిచిపోయింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం నీటి కటకట ఎదురైంది. గోదావరికి ఎగువ ప్రాంతం, క్యాచ్​మెంట్​ ఏరియా నుంచి ఇన్​ఫ్లో పూర్తిగా బంద్​ అయ్యింది.

కాళేశ్వరం నుంచి రివర్స్​ పంపింగ్​ చేసినప్పుడు ఎల్లంపల్లిలో 20 టీఎంసీల గరిష్ట సామర్థ్యం  మెయింటెయిన్​చేశారు. ఈ ఏడాది రివర్స్​ పంపింగ్​ చేసే అవకాశం లేదు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని, ఈ ఎండాకాలం గడవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

గూడెం లిఫ్ట్​ కింద ఎండుతున్న పంటలు 

కడెం ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గూడెం లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్​ చేసి దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్​మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో 18 టీఎంసీలు ఉంటేనే లిఫ్ట్​లు నడపాలనే ఆదేశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్​లో వాటర్​ లెవల్స్​ అంతకంటే తగ్గడంతో ఆందోళన మొదలైంది.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేగా, యాసంగి సీజన్​లో15వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీళ్లు ఇస్తామన్నారు. ఈ మేరకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వాటర్​ సప్లై చేసి, రెండు రోజుల కిందట లిఫ్ట్​ బంద్​ చేశారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నది. ఈ సమయంలో లిఫ్ట్​ బంద్​ కావడంతో పొలాలు ఎండుతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు మరో తడిని అందించాలని కోరుతున్నారు.