పంటలు ఎండుతున్నయ్..సాగునీరు అందక ఎండిపోతున్న వరి

పంటలు ఎండుతున్నయ్..సాగునీరు అందక ఎండిపోతున్న వరి
  • సాగునీరు అందక ఎండిపోతున్న వరి

మహబూబ్​నగర్, వెలుగు : వరి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వానాకాలం సీజన్  నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కాలువలు, బోర్లు, చెరువుల కింద ఉన్న పంటలను ఎలాగోలా కాపాడుకొని గట్టెక్కారు. యాసంగిలో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏటా యాసంగిలో 1.80 ఎకరాల్లో రైతులు వరి సాగు చేసేవారు. ఈ ఏడాది మాత్రం రెండు జిల్లాల్లో కలిపి 80 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే, ఇప్పుడు సాగులో ఉన్న పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రెండు జిల్లాల్లో ఇప్పటికే 20 శాతం పంటలు ఎండిపోయాయి. మహబూబ్​నగర్​ రూరల్​, చిన్నచింతకుంట, ఉట్కూరు

మాగనూరు, గండీడ్​, మహ్మదాబాద్, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. రైతులు ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. యాసంగి వరి నాట్లను డిసెంబరు నుంచి జనవరి లోపు పూర్తి చేసుకోవాల్సి ఉండగా, చాలా మండలాల్లో జనవరి చివరి వారం నుంచి నాట్లు వేసుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువై పైర్లు ఎదగలేదు. దీనికితోడు  మూడో వారం నుంచి ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడం మొదలైంది.

ప్రస్తుతం మహబూబ్​నగర్​ జిల్లాలో 10.19 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. కొన్ని చోట్ల బోర్లు పూర్తిగా వట్టిపోయాయి. సాగులో ఉన్న వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు అదనంగా బోర్లు వేస్తున్నా, నీళ్లు రావడం లేదు. బోర్లు వేయించడానికి వేలల్లో ఖర్చు పెట్టి నష్టపోతున్నారు. ఇక కొన్ని చోట్ల పంటలపై ఆశలు వదులుకున్న రైతులు పొలాలను పశువులకు మేత  కోసం వదిలేశారు.

ఉద్యాన పంటలదీ ఇదే పరిస్థితి..

ఉద్యాన పంటలు సాగు చేసుకుంటున్న రైతులు కూడా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాలో మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి పూత దశ నుంచి పిందె దశలోకి చేరింది. ఈ సమయంలో మామిడి తోటలకు నీరు పెట్టుకోవాల్సి ఉంది. అయితే, బోర్లు వట్టిపోవడంతో తోటలకు నీరు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెట్ల నుంచి పిందెలు రాలిపోతున్నాయి. బత్తాయి తోటలకు కాయలు పడుతుండగా, నీరు లేక కాయలు ఎదగడం లేదు. నిమ్మ తోటలదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. 

విచ్చలవిడిగా బోర్ల  డ్రిల్లింగ్..​

ప్రభుత్వ లెక్కల ప్రకారం మహబూబ్​నగర్​ జిల్లాలో 47 వేల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. గ్రౌండ్​ వాటర్​ పడిపోవడంతో బోర్లు పోస్తలేవు. అయితే, రైతులు పంటలు, తోటలను కాపాడుకోవడానికి విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ డ్రిల్​ చేస్తుండడంతో నీరు పడడం లేదు. కొందరు రైతులు ఏకంగా 250 ఫీట్ల నుంచి 300 ఫీట్ల వరకు డ్రిల్​ చేయించినా చుక్క నీరు పడలేదు. కేవలం బోర్లు డ్రిల్​ చేయించడానికే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే బోర్లు వేయించే రైతులు తమను సంప్రదించాలని జీడబ్ల్యూడీ ఆఫీసర్లు చెబుతున్నారు. నీరు అందుబాటులో ఉండే చోట బోర్లు డ్రిల్​ చేస్తే నీరు పడుతుందని అంటున్నారు.

పశువుల మేతకు వదిలేశా..

యాసంగిలో నాలుగు ఎకరాల్లో వరి వేసిన. రూ.1.20 లక్షల పెట్టుబడి అయ్యింది. రూ.లక్ష పెట్టి బోరు వేయించినా, ఇప్పుడు పోస్తలేదు. పది రోజుల నుంచి పంటకు నీళ్లు అందడం లేదు. దీంతో ఎండిపోయింది. చేసేది లేక పశువులకు మేత కోసం వదిలేసినా. రెండున్నర లక్షల వరకు నష్టం వచ్చింది.

 దుశెట్టి మహేశ్, మణికొండ

బోరు వట్టిపోయింది..

నిరుడు యాసంగిలో రెండు ఎకరాల్లో బోరు ఆధారంగా వరి వేసిన. మంచి దిగుబడి వచ్చింది. ఆ నమ్మకంతో ఈ యాసంగిలో వరి పెట్టిన. నాట్లు వేసిన నాటి నుంచి నీటి సమస్య వచ్చింది. బోరు వట్టిపోయింది. నీరు లేక వరి కూడా ఎండిపోయింది. 

 లక్ష్మణ్, ఊట్కూర్