సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్..గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా

 సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్..గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా
  •  
  • గత సర్కార్​లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా
  • ట్రీట్మెంట్ చేయకున్నా.. నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, దళారులు
  • ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు
  • ఇప్పటికే బయటపడ్డ కోదాడ  గ్యాంగ్ బాగోతం
  • నాడు ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసులు వేదికగా దందా
  • ఆ ఆఫీసుల్లో పని చేసినోళ్లే అసలు సూత్రధారులు
  • 2023 ఎన్నికలకు ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు
  • లోతుగా దర్యాప్తు చేయించేందుకు రెడీ అయిన ప్రభుత్వం
  • కరోనా టైమ్​లో వచ్చిన విరాళాలపైనా ఆరా

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్)ను కేటుగాళ్లు అక్రమంగా కాజేశారు. ట్రీట్మెంట్​ అందించకపోయినా అందించినట్లు నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొందరు.. లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వేరే ఖాతాల్లో జమ చేసుకుని ఇంకొందరు పేదల నిధులను కొట్టేశారు. 2023 ఎన్నికల సంవత్సరంలోనైతే అసలు ఎలాంటి బిల్లులు, కనీసం దరఖాస్తులు లేకుండానే నేరుగా పలువురి ఖాతాల్లో సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు జమ అయినట్లు తేలింది. ఇట్ల కోట్ల రూపాయల సొమ్ము అక్రమార్కుల పాలుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది.ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలపై దర్యాప్తు చేస్తుండగా.. అసలు గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్​ఎఫ్​లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని భావిస్తున్నది. పైగా కరోనా సమయంలో వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్​ ఫండ్​కు విరాళాల కింద వచ్చాయి. ఆ మొత్తం కూడా ఏమైనా మిస్​ యూజ్ అయిందా అనే కోణంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తున్నది. అదే సమయంలో పాత పద్ధతిలో ఉన్న సీఎంఆర్​ఎఫ్​ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్​ పెట్టింది. పూర్తిగా ఆన్ లైన్​ చేయడమే కాకుండా, పారదర్శకంగా ఉండేందుకు అకౌంట్​ డీటెయిల్స్ కూడా అప్లికేషన్​ సమయంలోనే తీసుకుంటున్నది. 

నకిలీ బిల్లులు.. ఫోర్జరీ స్టాంప్​లు

సీఎంఆర్​ఎఫ్​ అక్రమాల్లో ప్రధానంగా కొన్ని ముఠాలు ప్రైవేట్ హాస్పిటల్స్​తో చేతులు కలిపి.. చికిత్స చేయకున్నా లక్షల రూపాయల ట్రీట్మెంట్​ కోసం ఖర్చయినట్లుగా నకిలీ బిల్లులు, నకిలీ డిశ్చార్జ్​ సమ్మరీలను జారీ చేశాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులతో జత చేసి, ప్రభుత్వానికి సమర్పించి.. నిధులు పొందేవి. నిధులు మంజూరైన తర్వాత.. హాస్పిటల్స్​లోని సిబ్బం ది, మధ్యవర్తులు ఆ సొమ్మును పంచుకునేవారు. ఈ అక్రమాలు ప్రధానంగా హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వెలుగు చూశాయి. ఒకానొక దశలో సీఐడీ దర్యాప్తులో 28 ప్రైవేట్ హాస్పిటల్స్​పై ఆరు ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసింది. నకిలీ రబ్బర్ స్టాంపులు, ఫేక్ మెడికల్ బిల్లులతో అప్లికేషన్లు సబ్మిట్ చేసి నిధులు కాజేశారు. ఉదాహరణకు..: ఓపీకి కానీ, ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్​కు సీఎంఆర్ఎఫ్ అర్హత ఉన్న పేషెంట్​ వస్తే..  ఆ పేషెంట్​ నుంచి అన్ని వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత, వారికి వైద్యం అందించకపోయినా.. లక్షల రూపాయల ఖర్చుతో కూడిన చికిత్స జరిగినట్లుగా తప్పుడు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీలను ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి పొం దుతారు. ఈ పత్రాలపై ఫోర్జరీ స్టాంపులు, సంతకాలను ఉపయోగిస్తారు. అనంతరం.. ఈ నకిలీ పత్రాలను, దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి ఫోర్జరీ పత్రాలతో జత చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. నిధులు మంజూరు కాగానే, ఆ సొమ్మును దళారులు, ఆసుపత్రి యాజమాన్యం, ఇతర వ్యక్తులు పంచుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియలో లబ్ధిదారుడికి ఏమాత్రం సంబంధం ఉండదు. గత సర్కార్​లో ఈ రకం దందా విచ్చలవిడిగా సాగినట్లు ప్రభుత్వం గుర్తించింది. 

నాడు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులే వేదికగా..!

కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులకు వెళ్లిన చెక్కులు మిస్‌‌యూజ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పనిచేసిన కొందరు వ్యక్తులు ఈ అక్రమాలకు సూత్రధారులుగా వ్యవహరించినట్లు తేలింది. నియోజకవర్గానికి చెందిన స్థానిక లీడర్లు, గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు వారికి సంబంధించి ఏదైనా ప్రైవేట్  హాస్పిటల్స్​లో ట్రీట్మెంట్ చేయించుకుని.. పెద్ద మొత్తంలో బిల్లులు తెచ్చి సీఎంఆర్​ఎఫ్​కోసం స్థానిక ఎమ్మెల్యేకు అప్లై చేసుకునేవారు. అయితే చెక్కులు మంజూరు అయిన తర్వాత  అవి నేరుగా మళ్లీ ఎమ్మెల్యే ఆఫీస్​కే వచ్చేవి. ఇలా వాటిని కాజేసేవారు. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే కొంద రు అక్రమార్కులు పేదలకు వచ్చిన చెక్కులను వారికి ఇవ్వకుండా.. ‘మీ అప్లికేషన్​ రిజెక్ట్​ అయింది’ అంటూ వచ్చిన డబ్బులను పంచుకునేవారు. పైగా.. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఇతరుల చెక్కులను తమ బంధువుల ఖతాల్లోకి మళ్లించుకున్నారు.  ఇలా రకరకాలుగా సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీలో గోల్​మాల్​ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

బిల్లుల్లేకుండానే లక్షల్లో బదిలీ

అసలు ఎలాంటి బిల్లులు లేకుండా, దరఖాస్తులు లేకుండా నేరుగా సీఎంఆర్​ఎఫ్​ నిధులను గత ప్రభుత్వంలోని  కొందరు లీడర్లు మళ్లించుకున్నట్లు తాజాగా అధికారులు గుర్తించారు. సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు ఈ వ్యవహారం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఒక్కొక్కరు రూ.10 లక్షలు, రూ.20 లక్షల చొప్పున సీఎంఆర్​ఎఫ్​ నిధులు కాజేసినట్లు వెల్లడైంది. దీనిపైనా అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. 

అక్రమాలకు చెక్​ పెట్టేందుకు అంతా ఆన్​లైన్​

కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్​లో అక్రమాలను అరికట్టడానికి కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు, చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా ఆన్‌‌లైన్ చేయడం. ఈ కొత్త విధానంలో నేరుగా వెబ్‌‌సైట్ ద్వారా అప్లికేషన్‌‌ను సమర్పించవచ్చు. అప్లికేషన్​ నంబర్, ఏ స్టేజ్​లో ఉంది? ఎక్కడెక్కడ అప్రూవల్స్​ వస్తున్నాయి? ఎప్పటికప్పుడు మెసేజ్​ల రూపంలో వస్తుంది. దీంతో దళారుల అక్రమాలకు తావు ఉండదు. ఇకపై సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్‌‌ను కూడా ముద్రిస్తున్నారు. దీనివల్ల చెక్కులు చోరీకి గురైనా దుర్వినియోగం కాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. చివరికి చెక్కులు ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎప్పుడు చేరుతున్నాయో కూడా మెసేజ్​ వెళ్తుంది. ఈ మార్పుల వల్ల పారదర్శకత పెరిగి, అర్హులైన పేదలకు సకాలంలో సహాయం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

గత సర్కార్​లో సీఎంఆర్​ఎఫ్​ దందా ఇట్లా..!
    
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరైన దాదాపు 10 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో సగం వరకు లబ్ధిదారులకు అందకుండా పోయాయి.     
సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను మార్చేసి, డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించుకుంది. ఉదాహరణకు:  ‘గద్దె వెంకటేశ్వరరావు’ అనే వ్యక్తికి మంజూరైన రూ. 1.5 లక్షల సీఎంఆర్ఎఫ్ డబ్బులను, ‘గడ్డం వెంకటేశ్వరరావు’ అనే వేరే వ్యక్తి ఖాతాలోకి బదిలీ చేసి డ్రా చేశారు. బాధితుడు చాలా కాలం ఎదురు చూసి, ఆరా తీయగా ఈ మోసం బయటపడింది. ఈ ముఠా నాలుగేండ్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మాజీ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసిన వ్యక్తులు కూడా ఈ దందాలో ఉన్నట్లు సమాచారం.
    
కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దళారులతో కలిసి, రోగులకు చికిత్స చేయకపోయినా రూ. లక్షల్లో బిల్లులు సృష్టించాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులతో జతచేసి నిధులు మంజూరు చేయించుకున్నాయి. కొందరు వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల పేర్ల మీద నకిలీ దరఖాస్తులు పెట్టి నిధులు కాజేశారు. అసలు రోగికి తెలియకుండానే నిధులు మంజూరయ్యేవి.  దీంతో ఇప్పటికే ఇలాంటి ఆస్పత్రులపై  కేసులు నమోదు చేసి బ్లాక్​ లిస్ట్​లో పెట్టారు. 
    
సాధారణంగా గత ప్రభుత్వంలో ఓ మంత్రి కార్యాలయానికి వేల సంఖ్యలో సీఎంఆర్​ఎఫ్​ దరఖాస్తులు వచ్చేవి. ఆయన ఆఫీస్​లో  పనిచేసిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ సహా ఐదుగురు సభ్యుల ముఠా చెక్కులను దొంగిలించి, వాటిని ఫోర్జరీ పత్రాలతో నగదుగా మార్చుకున్నది. ఈ ముఠా సభ్యులు లబ్ధిదారుల ఇంటి పేరులో మొదటి అక్షరాన్ని ఆసరాగా చేసుకొని.. అదే అక్షరంతో ఉన్న ఇతర వ్యక్తుల పేర్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారు. ఉదాహరణకు, ‘టి.ఎల్లయ్య’ పేరుతో చెక్ జారీ అయితే, అదే పేరున్న వేరే వ్యక్తిని వెతికిపట్టుకొని డబ్బు డ్రా చేసేవారు.