సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ పహారా

సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ పహారా
  • కేంద్రం నిర్ణయం.. ఏపీ, తెలంగాణ అంగీకారం  
  • ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి  
  • రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ మీటింగ్ 
  • ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసులు, అధికారులు వెళ్లొద్దని ఆదేశం
  • కేఆర్ఎంబీ ఆదేశాలకు లోబడే నీటిని విడుదల చేయాలని ఆర్డర్ 
  • కృష్ణా జలాల వివాదంపై ఇయ్యాల ఢిల్లీలో జలశక్తి శాఖ మీటింగ్ 

హైదరాబాద్​/హాలియా, వెలుగు :  నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, తాత్కాలిక పరిష్కారం చూపించింది. ప్రాజెక్టు నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించాలని, ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ ​బలగాలతో పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి తెలంగాణ, ఏపీ​ ప్రభుత్వాలు అంగీకరించాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్​కుమార్ ​భల్లా శుక్రవారం ఢిల్లీ నుంచి ఇరు రాష్ట్రాల సీఎస్​లు, డీజీపీలు, ఇరిగేషన్ ​సెక్రటరీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. సాగర్​ నీటి విషయంలో నవంబర్​28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని మీటింగ్​లో నిర్ణయించారు. కాగా, ఏపీ పోలీసులు నవంబర్ ​29న ఏకపక్షంగా ప్రాజెక్టు వద్ద మోహరించి శాంతిభద్రతల సమస్య 
సృష్టించడంతో పాటు కుడి కాలువ హెడ్ ​రెగ్యులేటర్​గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో వివాదం 
తలెత్తింది. 

త్వరలోనే జలశక్తి శాఖ మీటింగ్: కేంద్రం

కేంద్ర హోం శాఖ సెక్రటరీ భల్లా మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై గతంలో మాదిరిగానే స్టేటస్​ కొనసాగించాలని చెప్పారు. డ్యామ్​పై తాత్కాలికంగా సెంట్రల్​రిజర్వ్ ​పోలీస్ ​ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ సహా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఇతర వివాదాలపై త్వరలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆ సమావేశంలో రెండు రాష్ట్రాలు టెక్నికల్ ​అంశాలతో పాటు అన్ని ఇతర అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. అప్పటి వరకు ఏపీ పోలీసులు, అధికారులు ప్రాజెక్టుపైకి వెళ్లరాదని.. కేఆర్ఎంబీ ఆదేశాలకు లోబడే నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్​లో తెలంగాణ తరఫున డీజీపీ అంజనీ కుమార్, ఇరిగేషన్ ​సెక్రటరీ స్మితా సబర్వాల్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, హోంశాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ జితేందర్, అడిషనల్​డీజీ ఎస్​కే జైన్, ఐజీ షానవాజ్ ​కాశీం, ఇరిగేషన్​ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్​దేశ్ ​పాండే
తదితరులు పాల్గొన్నారు. 

సాగర్​ వివాదంపై కేంద్రానికి కేఆర్ఎంబీ లేఖ.. 

నాగార్జున సాగర్​ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తిన వివాదంపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ సెక్రటరీ డీఎం రాయ్​పురే శుక్రవారం లేఖ రాశారు. ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రవర్తించిన తీరుపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లెటర్ రాయగా.. అందులోని అంశాలను పేర్కొంటూ కేంద్రానికి రాయ్ పురే లేఖ రాశారు. ‘‘ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపైకి దౌర్జన్యంగా చొచ్చుకు రావడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నీటిని ఏకపక్షంగా విడుదల చేసిందని.. ప్రాజెక్టుపై ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసిందని మాకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ లేఖ రాశారు. కేఆర్ఎంబీ రిలీజ్ ​ఆర్డర్​ లేకుండా ఏపీ నీటిని విడుదల చేసుకుంటోందని, దాన్ని వెంటనే ఆపేయాలని కోరారు. ధ్వంసం చేసిన సీసీ కెమెరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు” అని కేంద్రానికి రాసిన లేఖలో రాయ్ పురే పేర్కొన్నారు. ‘‘కేఆర్ఎంబీ త్రీమెంబర్​కమిటీ సమావేశంలో నాగార్జున సాగర్​నుంచి ఏపీ 15 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది. 2023 అక్టోబర్​10 నుంచి 20 మధ్య 5 టీఎంసీలు, 2024 జనవరి 8 నుంచి 18 మధ్య 5 టీఎంసీలు, ఏప్రిల్​8 నుంచి 24 మధ్య మిగిలిన 5 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారనే విషయాన్ని లేవనెత్తింది. ఈ రిలీజ్​ఆర్డన్​ను బోర్డు సవరించి తదుపరి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అయినా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నీటిని విడుదల చేసుకుంటోందని మా దృష్టికి తెచ్చింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఏపీ ఇరిగేషన్​ సెక్రటరీకి లేఖ రాసి నీటి విడుదలను వెంటనే ఆపేయాలని ఆదేశించాం. ఈ ఏడాది అక్టోబర్​9న ఇచ్చిన వాటర్​ రిలీజ్​ఆర్డర్​కు లోబడే నీటిని తీసుకోవాలని చెప్పాం” అని తెలిపారు. నవంబర్​30న సాగర్​గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసిందని, వెంటనే నీటి విడుదలను ఆపేయాలని ఆదేశించామన్నారు. కాగా, ఈ వివాదంపై బోర్డు నుంచి లేఖ రాసిన కొన్ని గంటల్లోనే కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపించింది.

రాష్ట్రాల వాదనలివీ.. 

తమ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం శాంతిభద్రతల సమస్య సృష్టించిందని తెలంగాణ సీఎస్​ శాంతి కుమారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ​‘‘నవంబర్​29న రాత్రి ఏపీకి చెందిన 500 మంది పోలీసులు నాగార్జున సాగర్ ​డ్యామ్​పైకి చేరుకుని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. హెడ్​ రెగ్యులేటర్​లోని ఐదు, ఏడో గేట్లను తెరిచి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మేం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం తన చర్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించింది. ఏపీ ప్రభుత్వం ఈ విధంగా అతిక్రమణలకు పాల్పడటం ఇది రెండోసారి. ఏపీ చర్యలతో హైదరాబాద్​తో పాటు పరిసర ప్రాంతాల్లోని 2 కోట్ల మంది తాగునీటి అవసరాలకు ఆటంకం కలుగుతుంది. ప్రాజెక్టు నిర్వహణపై 2014 నుంచి ఉన్న మాదిరిగానే స్టేటస్​కో  కొనసాగించాలి” అని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎస్​జవహర్​రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్​కు 26 గేట్లు ఉండగా, అందులో 13 గేట్లు తమ రాష్ట్ర పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చేతుల్లోనే ఉండాలని రూలేమీ లేదన్నారు. ప్రాజెక్టు నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని పేర్కొన్నారు. 

ఇయ్యాల జలశక్తి శాఖ మీటింగ్ 

కృష్ణా జల వివాదంపై శనివారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్​లో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొనాలని ఏపీ, తెలంగాణ అధికారులకు శుక్రవారం లేఖ రాశారు. వీడియో కాన్ఫరెన్స్​ద్వారా కూడా సమావేశంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. నాగార్జున సాగర్​ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, కేఆర్ఎంబీతో ముడిపడి ఉన్న సమస్యలపై చర్చించనున్నారు.