అలలపై విలాసానికి వైరస్ తాకిడి

అలలపై విలాసానికి  వైరస్ తాకిడి

నీటిమీద తేలియాడే స్వర్గం ఏదైనా ఉందంటే… అది క్రూయిజ్​ షిప్​ అనే చెప్పాలి. అందులో లేని సదుపాయమంటూ ఉండదు. వారం రోజులు, 15 రోజుల చొప్పున ట్రిప్స్​ వేస్తూ, సముద్రం అందాలతో మైమరిపిస్తుంది. సన్​ రైజ్​ని, సన్​ సెట్​ని డెక్ మీద నుంచే ఎంజాయ్​ చేసేలా డిజైన్​ చేసి, టూరిస్టులను ఆకట్టుకుంటారు షిప్​ ఓనర్లు. చిటికేస్తే క్షణాల్లో కాంటినెంటల్​ ఫుడ్​ వేడి వేడిగా టేబుల్​ మీదకొచ్చేస్తుంది. ముట్టుకుంటే మాసిపోయే తెలుపుతో క్రూయిజ్​ కంపార్టుమెంట్లలో బెడ్​లు మెరుస్తుంటాయి. ఇక, ఇంటీరియర్​​ డిజైన్​ గురించి చెప్పనక్కర లేదు. స్విమ్మింగ్​ పూల్స్​, బిలియర్డ్​ టేబుల్స్​, రెస్టారెంట్స్​, షాపింగ్​, థియేటర్లు, డ్యాన్సింగ్​, మ్యూజిక్​… ఇవన్నీ ఉంటాయి క్రూయిజ్​ షిప్పుల్లో.

అలాంటి కదిలే స్వర్గంలో ప్రయాణిస్తున్నవాళ్లకు చెప్పలేనన్ని కష్టాలొచ్చాయి.  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కొవిడ్​–19) వైరస్ ప్రయాణీకులకు​ సోకిందన్న అనుమానంతో మూడు ఖరీదైన క్రూయిజ్​లను వేర్వేరు దేశాల్లో నిలిపేశారు.  జపాన్​లో డైమండ్​ ప్రిన్సెస్ క్రూయిజ్​​ని, హాంకాంగ్​లో వరల్డ్​ డ్రీమ్​ క్రూయిజ్​ని, కంబోడియాలో వెస్టర్​డామ్​ క్రూయిజ్​ని  నిలిపేశారు. అక్కడి పోర్టుల్లో లంగరు వేసి, పాసింజర్లకు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటి వరకు జెమ్​ క్లాస్​ షిప్​ కేటగిరీకి చెందిన డైమండ్​ ప్రిన్సెస్​లో 542 మందికి, వరల్డ్​ డ్రీమ్​లో ముగ్గురికి కొవిడ్​–19 వైరస్​ సోకినట్లుగా ఖాయం చేశారు. వెస్టర్​డామ్​ క్రూయిజ్​లో ఎవరికీ పాజిటివ్​ రిజల్ట్​ రాలేదు.  జనవరి రెండో వారంలో డైమండ్​ ప్రిన్సెస్​ క్రూయిజ్​ ప్రయాణీకులు, సిబ్బంది కలిసి మొత్తం 3,750 మందితో బయలుదేరిన తర్వాత కరోనా వైరస్​ వార్తలు వెలువడ్డాయి. క్రూయిజ్​ ప్రయాణిస్తున్న మార్గంలోని ఏదైనా దేశంలో వైరస్​ లేదా అంటువ్యాధులు సోకుతున్నప్పుడుగానీ, వాళ్ల టూర్​ సాగాల్సిన ఏదైనా దేశంలో అంటువ్యాధులు వచ్చినప్పుడుగానీ పాసింజర్​ షిప్​లను తనిఖీ చేస్తారు. అదే పద్ధతిలో డైమండ్​ ప్రిన్సెస్​లో చెక్​ చేసినప్పుడు 80 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్​ని గుర్తించారు. జనవరి 20న హాంకాంగ్​కి చెందిన ఈ వ్యక్తి యొకోహామా (జపాన్​) రేవులో క్రూయిజ్​ ఎక్కారు. ఆయనను అయిదు రోజుల తర్వాత టెస్టుల్లో పాజిటివ్​గా తేలడంతో హాంకాంగ్​లో దింపేశారు. ఫిబ్రవరి నాలుగు నాటికి జపాన్​ జలాల్లోకి వచ్చినప్పుడు మరోసారి టెస్ట్​లు చేయగా, రోజురోజుకూ వైరస్​ బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో యొకోహామా పోర్టులోనే క్రూయిజ్​ని ఆపేశారు. ఇప్పటివరకు 524 మందికి కొవిడ్​–19 సోకినట్లుగా గుర్తించారు. ఈ క్రూయిజ్​లో ఉన్న వివిధ దేశాల పాసింజర్లను ఆయా దేశాల ఎంబసీలు ప్రత్యేక ఏర్పాట్లతో వెనక్కి తీసుకెళ్లిపోయాయి. అమెరికా 300కి పైగా తమ దేశస్తుల్ని స్వదేశానికి తరలించింది. కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్​కూడా తమవాళ్లను తీసుకెళ్లిపోయాయి. బ్రిటన్​ దేశీయులు డేవిడ్​ ఏబెల్​, అతని భార్య ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ఫేస్​బుక్​లో పోస్టు చేస్తున్నారు. ‘మా దేశం వాళ్లు పట్టించుకోవట్లేదు. నేను షుగర్​ పేషెంట్​ని. నాకు వేళకు సరైన తిండి పెట్టేవాళ్లుగానీ, మందులిచ్చేవాళ్లుగానీ లేరు. జైలులో ఉన్నట్లుంది’ అని తమ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

వెస్టర్​డామ్​కి అయిదు దేశాలు ‘నో’

మూడో క్రూయిజ్​ వెస్టర్​డామ్​లో ఎవరికీ కొవిడ్​–19 వైరస్​ లేదని పరీక్షల్లో తేలింది. ఈ క్రూయిజ్​లో సిబ్బంది పాసింజర్లు మొత్తం 2,000 వరకు ఉన్నారు. వైరస్​ భయంతో అయిదు దేశాలు క్రూయిజ్​ని రానివ్వలేదు. జపాన్​, ఫిలిప్పీన్స్​, తైవాన్​, థాయిలాండ్​, అమెరికా భూభాగానికి చెందిన గువామ్​ ఐలాండ్​ ఈ క్రూయిజ్​ ఆగడానికి ఒప్పుకోలేదు. హాలండ్​ అమెరికన్​ లైన్​వాళ్లు వెస్టర్​డామ్​ని నడుపుతున్నారు. చివరికి కంబోడియా అంగీకరించడంతో సిహనౌక్​విల్లే రేవులో లంగరు వేశారు. అక్కడ టెస్టులు పూర్తయ్యాక నామ్​ఫెన్​కి చార్టర్​ ఫ్లయిట్లద్వారా పాసింజర్లను తరలించారు. సొంత ఖర్చులపై క్రూయిజ్​ ఆపరేటర్లు వాళ్లను స్వదేశాలకు తరలిస్తామని ప్రకటించారు.

కొవిడ్ 19 వైరస్ దెబ్బకు డైమండ్​ ప్రిన్సెస్​, వరల్డ్​ డ్రీమ్​ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ రెండు క్రూయిజ్​ల నుంచి పాజిటివ్​గా గుర్తించినవాళ్లెవరినీ బయటకు వదలడం లేదు. ఈ క్రూయిజ్​లు వాటంతట అవే ‘క్వారంటైన్​’లుగా మారిపోయాయి. నౌక నుంచి బయటికి అడుగుపెడితే మిగతా వారికి వైరస్ సోకుతుందన్న భయంతో క్రూయిజ్​లను ఇలా నిలిపివేస్తుంటారు. మొత్తమ్మీద కొవిడ్​–19 వైరస్​ క్రూయిజ్​ ఆపరేటర్లకు చుక్కలు చూపించిందనే చెప్పాలి.