
- మైనింగ్ అధికారులు మూసేయమంటున్నారు : యజమానులు
- పని లేక ఆందోళనలో కూలీలు
ముదిగొండ, వెలుగు: మండలంలో 24 గంటలు నడిచే క్రషర్లు మూత పడుతున్నాయి. మొత్తం 10 క్రషర్లు ఉంటే వాటిలో 4 ఇప్పటికే మూతపడ్డాయి. మిగతావి కూడా మూసేస్తామని యజమానులు చెబుతున్నారు. ఏ క్రషర్వద్దకు వెళ్లి అడిగినా మైనింగ్అధికారులు మూసేయమన్నారనే సమాధానమే వస్తోంది. కంకర, డస్ట్కు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. క్రషర్లలో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుండగా వందల కుటుంబాలకు ఉపాధి లభించేది.
ఇప్పుడు అవి మూతపడుతుండడంతో పని విషయంలో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మధిర నియోజకవర్గంలో ఇటీవల వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముదిగొండ మండలంలో అధికంగా ఉన్న కంకర క్రషర్లకు కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. పలు నిర్మాణాలు చేపడుతున్నవారు కంకర అందక ఇబ్బంది
పడుతున్నారు.
అమరావతికి వెళ్తున్న క్రషర్లు!
ముదిగొండ మండలంలోని 2, 3 క్రషర్లు మెషినరీతో సహా అమరావతికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక్కడి అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకనే అక్కడికి షిఫ్ట్అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ముదిగొండలో 40 ఏండ్ల క్రితం పెట్టిన పటేల్ కంకర క్రషర్ లోని మెషినరీని స్క్రాప్ కు వేశారు. క్రషర్లు మూతపడుతుండడంతో కంకర, డస్ట్రేట్లు అమాంతం పెరగనున్నాయి.