ఐపీఓకి క్రిప్టో కంపెనీలు!

ఐపీఓకి క్రిప్టో కంపెనీలు!

పేపర్లు ఫైల్‌‌‌‌ చేసిన కాయిన్‌‌‌‌బేస్‌‌‌‌
ఈ ఏడాదిలోనే రావాలని చూస్తున్న మరో 7 కంపెనీలు
పేపర్లు ఫైల్‌‌‌‌ చేసిన కాయిన్‌‌‌‌బేస్‌‌‌‌
ఈ ఏడాదిలోనే రావాలని చూస్తున్న మరో 7 కంపెనీలు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ఇనీషియల్‌‌‌‌ పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌(ఐపీఓ) లకు డిమాండ్‌‌‌‌ పెరుగుతుండడంతో క్రిప్టోకరెన్సీ రిలేటెడ్ కంపెనీలు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కరోనా దెబ్బతో బిట్‌‌‌‌కాయిన్ వాల్యూ రికార్డ్‌‌‌‌ గరిష్టాలకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో క్రిప్టో ఎక్స్చేంజ్‌‌‌‌లు, క్రిప్టో కరెన్సీ మైనింగ్ కంపెనీలకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. సుమారు ఎనిమిది క్రిప్టో కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకి రావాలని ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఇప్పటికే యూఎస్‌‌‌‌ కంపెనీ కాయిన్‌‌‌‌బేస్‌‌‌‌ ఐపీఓ పేపర్లను ఫైల్‌‌‌‌ చేసింది. చైనాకు చెందిన రెండు క్రిప్టోకరెన్సీ మైనింగ్ కంపెనీలు ఐపీఓ వాచ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉన్నాయని  ఫైనాన్షియల్‌‌‌‌ కంపెనీ రెనాసియెన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ పేర్కొంది.  కొన్ని కంపెనీలు డైరక్ట్‌‌‌‌గా ఐపీఓకి రానుండగా, మరికొన్ని కంపెనీలు స్పెషల్‌‌‌‌ పర్పోజ్‌‌‌‌ అక్వజేషన్‌‌‌‌ కంపెనీ(ఎస్‌‌‌‌పీఏసీ) ల ద్వారా డబ్బులు సమీకరించాలని చూస్తున్నాయి. కాగా, గత కొన్నేళ్ల నుంచి ఎస్‌‌‌‌పీఏసీలకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు లేదా స్పాన్సర్లు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఎస్‌‌‌‌పీఏసీకి ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ ఉండవు. కేవలం ఐపీఓ ద్వారా డబ్బులు సేకరించి మరొక కంపెనీని కొనడానికి ఈ డబ్బులు వాడతాయి. ఎస్‌‌‌‌పీఏసీ ఐపీఓలో ఇన్వెస్ట్‌‌‌‌ చేసిన వారికి ఈ కంపెనీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందో ముందుగా తెలియదు. అందుకే ఈ కంపెనీలను బ్లాంక్ చెక్ కంపెనీలని కూడా అంటారు.

పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకే…

కిందటేడాది మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సుమారు 90 శాతం పెరిగాయి. బుల్‌‌‌‌రన్‌‌‌‌ కొనసాగుతున్నప్పుడే  ఐపీఓలకి వచ్చి లాభపడాలని కంపెనీలు చూస్తున్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ కంపెనీలు  కాయిన్‌‌‌‌బేస్‌‌‌‌, ఈటోరో, జెమిని ట్రస్ట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌,  క్రిప్టో కరెన్సీ మైనింగ్ కంపెనీలు మైక్రోబీటీ, బిట్‌‌‌‌మెయిన్‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌, బిట్‌‌‌‌ఫ్యూరీలు ఈ ఏడాది ఐపీఓకి వచ్చేందుకు చూస్తున్నాయని రెనాసియెన్స్‌‌‌‌ పేర్కొంది. ఒకే సెక్టార్‌‌‌‌‌‌‌‌కు చెందిన కొన్ని కంపెనీలు ఒకేసారి ఐపీఓలకు వెళుతున్నాయంటే..ఈ కంపెనీలను నడిపేటోళ్లకు తమ వాల్యూ ఎక్కువగా ఉందనే విషయం అర్థమయినట్టుందని మిల్లర్‌‌‌‌‌‌‌‌ టాబక్‌‌‌‌ + కో చీఫ్‌‌‌‌ స్ట్రాటజిస్ట్‌‌‌‌ మాట్‌‌‌‌ మేలే అన్నారు. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని వీరు చూస్తున్నారని చెప్పారు.  ప్రస్తుతం బిట్‌‌‌‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, లాభాల్లో నడుస్తున్న క్రిప్టో కరెన్సీ రిలేటెడ్‌‌‌‌ కంపెనీలకు డిమాండ్ ఉంటుందని డేటా ఎనలిటిక్స్ కంపెనీ స్క్యూ ఫౌండర్ ఎమ్మాన్యూల్‌‌‌‌ గోహ్‌‌‌‌ అంచనావేశారు.

కాయిన్‌‌‌‌బేస్ గేమ్‌‌‌‌ చేంజర్..

కాయిన్‌‌‌‌బేస్‌‌‌‌ వాల్యూ 2018 లోనే 8 బిలియన్ డాలర్లకు పైనుంది. ఈ కంపెనీ ఐపీఓ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీలో గేమ్‌‌‌‌ చేంజర్‌‌‌‌‌‌‌‌గా మారుతుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి 3.5 కోట్ల మంది వెరిఫైడ్‌‌‌‌ యూజర్లున్నారు. కంపెనీ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో 25 బిలియన్‌‌‌‌ డాలర్ల విలువైన అసెట్స్‌‌‌‌ ఉన్నాయి. కాగా,  ఐపీఓకి సంబంధించి కాయిన్‌‌‌‌బేస్ స్పందించలేదు. క్రిప్టో కరెన్సీ కంపెనీలకు స్టాక్ మార్కెట్లో ఆదరణ దక్కితే ఈ ఇండస్ట్రీ మరింతగా వృద్ధి చెందుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరల్డ్‌‌‌‌లోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఇండస్ట్రీ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీనేనని కాయిన్‌‌‌‌ మెట్రిక్స్‌‌‌‌ ఫౌండర్ నిక్ కార్టర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం సరియైనదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీ కంపెనీలు ఐపీఓలకు రావాలనుకోవడం మంచిదేనని క్వాంటమ్‌‌‌‌ ఎకనామిక్స్‌‌‌‌ ఫౌండర్ మార్టి గ్రీన్‌‌‌‌స్పాన్‌‌‌‌ అన్నారు. డబ్బులు సేకరించడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. బిట్‌కాయిన్ ధర పెరగడంతో క్రిప్టో మైనింగ్ కంపెనీలకు డిమాండ్‌ ఉందన్నారు.