
చెపాక్ స్టేడియంలో చెన్నై తేలిపోయింది. ధోనీ కెప్టెన్సీ చేసే ఈ మ్యాచ్ మామూలుగా ఉండదు.. అని ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు చెన్నై ప్లేయర్లు. స్టార్టింగ్ నుంచే టపా టపా వికెట్లను సమర్పించుకున్నారు. హోమ్ గ్రౌండ్ లో చెన్నై మాయాజాలం చేస్తుందనుకున్న ఫ్యాన్స్ శుక్రవారం (ఏప్రిల్ 11) మ్యాచ్ లో నిరాశే ఎదురైంది. కోల్ కతా బౌలింగ్ ధాటికి ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యల్ప స్కోర్ చేశారు. మొత్తం 20 ఓవర్లలో కేవలం 103 రన్స్ చేసి కోల్ కతా ముందు మోకరిల్లారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా బౌలింగ్ లో పట్టుబిగించింది. మొదట్లో భారీ షాట్లు ఆడాలనుకున్న చెన్నై బ్యాటర్లు.. బాల్ స్వింగ్ అవుతుంటే తడబడ్డారు. ఈ క్రమంలో 3వ ఓవర్లో ఓపెనర్ కాన్వే 12 రన్స్ కే మొయిన అలీ బౌలింగ్ లో LBW గా ఔటయ్యాడు. కాన్వే గేట్లు ఓపెన్ చేశాడా అన్నట్లుగా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (4) హర్షిత్ రాణా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు.
ఓపెనర్లు ఔటయ్యాక.. కాస్త మెరుపులు మెరిపించినట్లు కనిపించిన విజయ్ శంకర్ బారీ షాట్లు కొట్టడానికి తడబడ్డాడు. మూడు లైఫ్ లు వచ్చినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 21 బాల్స్ లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 29 రన్స్ చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (16), అశ్విన్ (1) వెంట వెంటనే క్యూ కట్టారు. ఇక రవీంద్ర జడేజా, దీపక్ హుడా ఇద్దరు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో డకౌట్స్ తో తీవ్ర నిరాశ పరిచారు.
ఫ్యాన్స్ ఎంతో ఆశ పెంచుకున్న ధోనీ కాసేపైనా క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 4 బాల్స్ ఆడి సునిల్ నరైన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. వికెట్లు వరుసగా పడిపోతున్నా.. శివం దూబే ఒక్కడు ఔట్ కాకుండా నిలబడినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. చెన్నై బ్యాటర్లలో దూబే ఒక్కడే 30 రన్స్ స్కోర్ ను దాటించాడు. మొత్తం 29 బంతులు ఆడిన దూబే.. 3 ఫోర్లతో 31 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 4 ఓవర్లు వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. చెన్నై ని బొక్కబోర్లా పడేయడంలో పెద్ద దెబ్బ కొట్టాడు నరైన్. ఇక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఇద్దరూ ఒక్కో వికెట్ తీసుకున్నారు. బౌలర్లలో వైభవ్ అరోరా ఒక్కడే 7.75 ఎకనమీ రేట్ తో రన్స్ ఇచ్చాడు. మిగతా ఏ ఒక్కరి ఎకానమీ కూడా 6 దాటలేదు.
వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిన చెన్నై.. ఇవాళ గెలవాల్సిన మ్యాచ్ లో ఘోరంగా ఢీలా పడిపోయింది. ఈ 2025 ఐపీఎల్ సీజన్ లోనే అతి తక్కువ స్కోర్ చేసి చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఈ మ్యాచ్ లో కానీ ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. చూడాలి మరి.. కోల్ కతా ఎంతసేపట్లో మ్యాచ్ ను ముగించేస్తుందో.