హైదరాబాద్, వెలుగు: నిత్యం మీటింగ్స్, కాన్ఫరెన్సులు, టార్గెట్స్‌తో సతమతమయ్యే కార్పొరేట్ ఉద్యోగుల్లో జోష్ నింపడానికి, టీమ్‌లో కొత్తగా చేరే వారిలో బెరుకు, బిడియం పోగొట్టడానికి కమ్యూనిటీ కిచెన్ అద్భుతంగా పనిచేస్తుందని హైదరాబాద్ ఫుడ్స్టార్టప్ ది కలినరీ లాంజ్ (టీసీఎల్) మనస్పూర్తిగా నమ్ముతుంది.
ఎందుకంటే రుచికరమైన తెలంగాణ వంటకాలను స్వయంగా వండి, నచ్చిన డ్రింక్స్‌తో ఎంజాయ్చేస్తే ఉండే మజాయే వేరు! ఇదే ఐడియాతో సక్సెస్ సాధించారు టీసీఎల్ ఫౌండర్ గోపీ బైలుగొప్పుల. తెలంగాణ రుచులు, ఆతిథ్యం, సంస్కృతిని పరిచయం చేస్తూ కార్పొరేట్ఉద్యోగుల మనసుల్లో ఉల్లాసం నింపుతున్నారు. తన సంస్థ విజయాలు, విస్తరణ, ప్రత్యేకతల గురించి ‘వెలుగు’తో మాట్లాడారు. వివరాలన్నీ ఆయన మాటల్లోనే..
ఆతిథ్యం అదుర్స్...
మాది పెద్ద కుటుంబం. మా అమ్మ ఎప్పుడూ వంటగదిలోనే ఉండేది. ఆమెతోపాటు నేనూ ఎక్కువ సమయం అక్కడే గడిపేవాణ్ని. అందుకే నాకు ఆహారంతో అనుబంధం ఏర్పడింది. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచే శక్తి భోజనానికి ఉందని నేను నమ్ముతాను. అందుకే 2018లో టీసీఎల్‌ను ఏర్పాటు చేశాను. విలాసవంతమైన ఆతిథ్యం, ఫుడ్ ఇన్నోవేషన్ మా ప్రత్యేకత. ఆహారాన్ని ఒక సామాజిక వనరుగా ఉపయోగించి, కార్పొరేట్ బృందాలను కిచెన్‌లో నిమగ్నం చేయడం మా ప్రత్యేకత.
ప్రాంతీయ సంస్కృతి, వంటకాలు, వారసత్వం, కంపెనీ పని విలువలను కలగలిపి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. మా కస్టమర్లను స్వయంగా మార్కెట్లకు తీసుకెళ్లి కూరగాయలు, మాంసం, మసాలాలు వంటివి కొంటాం. వారిని గ్రూపులుగా విడదీసి కమ్యూనిటీ కిచెన్‌లో వంటలు చేయిస్తాం. వీలును బట్టి సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను చూపిస్తాం.
ఆదాయం, లక్ష్యాలు:
మా ఆదాయంలో 75 శాతం కార్పొరేట్ టీమ్ ఎంగేజ్‌మెంట్స్ నుంచి వస్తుంది. మిగిలిన మొత్తం అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు, లగ్జరీ హోటళ్ల క్యులినరీ అనుభవాల నుంచి సమకూరుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ విభాగమే అత్యధిక వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాం. ఇప్పటివరకు రూ. 4.16 కోట్ల నిధులను సమీకరించాం. వ్యాపార విస్తరణ కోసం మరో రూ.4.16 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కంపెనీ ప్రస్తుతం 15 శాతం ఇబిటా మార్జిన్‌తో లాభదాయకంగా ఉంది. ప్రస్తుత అంచనా విలువ 40 కోట్లు ఉంది. భవిష్యత్తులో ఒక గ్లోబల్ ప్లేయర్ ద్వారా అక్విజిషన్ (స్వాధీనం) కావడమే మా ఎగ్జిట్ స్ట్రాటజీ.
మార్కెట్, విస్తరణ:
ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరుకు, ఆ తర్వాత సంవత్సరంలో పుణె, ముంబైలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టీమ్- బిల్డింగ్ కోరే కార్పొరేట్ కంపెనీలు, ఆహార ప్రియులు, అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు. గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ వంటి ఫార్చ్యూన్ 100 కంపెనీల నాయకులు మా క్లయింట్లు. సెజ్ కంపెనీలతోనూ ఒప్పందాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రారంభించిన 'కలినరీ ఎక్స్‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్' కార్యక్రమానికి టీసీఎల్ప్రధాన కార్యనిర్వాహకురాలుగా పనిచేస్తుంది. ప్రపంచ టూరిజం జీడీపీలో 25 శాతం వాటా కలిగిన కలినరీ టూరిజం ద్వారా తెలంగాణకు రూ.8,000 కోట్లు సమకూరే అవకాశం ఉంది.
