ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటికేడు తగ్గుతున్న సాగు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటికేడు తగ్గుతున్న సాగు
  • గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామంటున్న రైతులు
  • నామ్​కే వాస్తే గా ఫ్యాక్టరీ నడుపుతున్న యాజమాన్యం
  • పక్కా జిల్లాల నుంచి చెరుకు తెస్తూ తంటాలు
  • సబ్సిడీపై కోత యంత్రాలు ఇవ్వాలని రైతుల డిమాండ్

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెరుకు పంటను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన చెరుకు ఫ్యాక్టరీతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం, లాభసాటి ధర లేక రైతులు చెరుకు సాగును ఏటికేడు తగ్గిస్తున్నారు. దీంతో జిల్లా నుంచి సరిపోను చెరుకు రాక యాజమాన్యం  ఇతర జిల్లాల నుంచి చెరుకు తెచ్చి ఫ్యాక్టరీని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. చెరుకు రైతులకు కేంద్రం ఇచ్చే టన్ను మద్దతు ధర రూ.3,129 మాత్రమే అందుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ  అందడం లేదు. సాగుకు పెరిగిన పెట్టుబడులు, కోత టైంలో అయ్యే కూలీల ఖర్చుకే వచ్చిన పైసలు సరిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు  చెరుకు ఫ్యాక్టరీ లో తరచూ జరుగుతున్న వివాదాలు, ఫ్యాక్టరీ ని  కర్నాటకకు తరలిస్తారన్న  ప్రచారంతో చెరుకు సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. 

తగ్గుతున్న చెరుకు సాగు.. 

 కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే చెరుకు ఫ్యాక్టరీలు ఉమ్మడి రాష్ట్రంలో 26 ఉండగా..  ప్రస్తుతం తెలంగాణలో 7 నడుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులోని  5 జిల్లాలతో పాటు ఏపీ లో ని కర్నూల్ , నంద్యాల జిల్లాల నుంచి ఇక్కడి ఫ్యాక్టరీకి  ఏటా రైతులు చెరుకు నీ తీసుకువస్తుంటారు.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టన్ను మద్దతు ధర రూ.3129 కి తోడు  మరో  రూ.21 చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం కలిపి  రైతులకు రూ.3,150 చెల్లిస్తోంది. మద్దతు ధర విషయంలో దేశం మొత్తం కలిపి ఒకే పాలసీ అమలవుతుండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించక రాష్ట్రంలో చెరుకు దిగుబడి తక్కువగా వచ్చి చెరుకు సాగు లాభాలను ఇవ్వడం  లేదని రైతులు వాపోతున్నారు. అయితే ఇక్కడ టన్నుకు రూ.4,500 చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో  ఎకరాకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి వస్తుండగా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో 45 నుంచి 50 టన్నుల దిగుబడి వస్తుండడం వల్ల అక్కడి వారికి ఈ పంట అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. 15 ఏళ్లుగా చెరుకు పంటను ఫుడ్ క్రాప్ గా గుర్తించడంతో  పెద్దగా రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ధర పెరగక పోవడంతో రైతులకు మేలు జరగడం లేదని అధికారులు అంటున్నారు.  

చెరుకు రైతులకు అప్పులు ఇస్తలేరు.. 

ఉమ్మడి జిల్లాలో చెరుకు సాగు విస్తీర్ణం 10వేల ఎకరాల పైగానే ఉంది. అయితే  వరి, ఇతర వాణిజ్య పంటలకు  ఇచ్చినట్లుగా చెరుకు రైతులకు బ్యాంకర్లు లోన్లు ఇస్తలేరు. ఏడాదికి ఒకే సారి పంట చేతికి వస్తుండడం, ఫ్యాక్టరీ లు  పంట కొన్న వెంటనే పేమెంట్​చేయకుండా విడతల వారీగా ఇస్తుండడం వల్ల రైతులు తీసుకున్న అప్పులు కూడా కట్టలేకపోతున్నారు. బ్యాంకర్లు కొత్త అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం అదనపు ధర ఇవ్వక కోత సమయంలో కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి లాంటి సమస్యల వల్ల చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

చెరుకు సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు 

ఉమ్మడి జిల్లాలో చెరుకు సాగు చేసిన రైతులు ఇతర పంటలు కూడా వేస్తున్నారు. వాటిపై పెడుతున్న శ్రద్ధ చెరుకు పంటపై  పెడ్తలేరు. పంట నాటుకున్నాక నీళ్లు పారిస్తున్నారే తప్పా.. ఎలాంటి పెట్టుబడి పెడ్తలేరు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో తేమ శాతం పెరిగింది. రైతులు దృష్టి పెడితే 40 – 45 టన్నుల దిగుబడి పొందవచ్చు. అప్పుడు లాభాలు వస్తాయి.  

– నర్సిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, షుగర్​కేన్​ఇండస్ట్రీస్​డిపార్ట్​మెంట్​

కోత యంత్రాలు వస్తేనే కష్టాలు తీరుతయ్​  

అంతటా చెరుకు పంట కోతకు యంత్రాలొచ్చినయ్​. వీటిని  ప్రభుత్వం  సబ్సిడీపై ఇస్తుంది.  మా జిల్లాలోని ఫ్యాక్టరీకి  కోత యంత్రం లేదు. స్థానిక కూలీలేమో చెరుకు కోతకు వస్తలేరు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తుంది. వారికి ఎక్కువ కూలీ, వసతి కల్పిస్తేనే వస్తున్రు. యంత్రాలు ఇస్తే కష్టాలు తీరుతయ్.

– తిరుమల్, చెరుకు  రైతు, ఆత్మకూరు