ఖతర్నాక్‌ కమిన్స్‌

ఖతర్నాక్‌ కమిన్స్‌
  • 15 బాల్స్‌‌‌‌లోనే 56 రన్స్​తో విధ్వంసం
  • ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ రికార్డు​ సమం
  • kolkataకోల్‌‌కతాకు మూడో విక్టరీ
  • ముంబైకి హ్యాట్రిక్‌‌ ఓటమి

ముంబై: వరల్డ్‌‌‌‌ నంబర్‌‌ వన్‌‌ టెస్ట్​ బౌలర్‌‌ ప్యాట్ కమిన్స్‌‌ (15 బాల్స్‌‌లో   4 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 నాటౌట్‌‌)  ఐపీఎల్‌‌ 15వ సీజన్‌‌లో తన మొదటి  మ్యాచ్‌‌లోనే బ్యాటుతో విశ్వరూపం చూపెట్టాడు. స్టార్‌‌ బ్యాటర్లు సైతం ఆశ్చర్యపోయేలా... బౌలర్లంతా బెదిరిపోయేలా సునామీ ఇన్నింగ్స్‌‌తో కేక పుట్టించాడు. ఒకే ఓవర్లో 35 రన్స్‌‌ బాదడంతో పాటు ఐపీఎల్‌‌లో ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ (14 బాల్స్‌‌లో) రికార్డు సమం చేస్తూ.. ముంబై బౌలర్లకు పీడకల మిగిల్చాడు. కమిన్స్‌‌కు తోడు వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (50  నాటౌట్‌‌) సత్తా చాటడంతో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్​ రైడర్స్​ 5 వికెట్ల తేడాతో ముంబైని ఓడించి మూడో విక్టరీ సాధించింది. మరోవైపు ముంబై వరుసగా మూడోసారి ఓడింది. టాస్ కోల్పోయిన ఆ జట్టు తొలుత20 ఓవర్లలో 161/4 స్కోర్ చేసింది. సూర్యకుమార్ (36 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52),  తిలక్ వర్మ (38 నాటౌట్) ఆకట్టుకున్నారు. కమిన్స్‌‌ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్​లో కోల్ కతా 16 ఓవర్లలో 162/5 స్కోరు చేసి గెలిచింది. మిల్స్ (2/38), మురుగన్ (2/25) రెండేసి వికెట్లు తీశారు. 2018లో 14 బాల్స్​లోనే   ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ కొట్టిన లోకేశ్​ రాహుల్​ రికార్డును సమం చేసిన కమిన్స్‌‌కే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

రాణించిన సూర్య, తిలక్‌‌ 
కోల్ కతా బౌలర్ల సూపర్ బౌలింగ్ తో ప్రారంభంలో ముంబై బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ రోహిత్ (3)ను మూడో ఓవర్లోనే ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఇషాన్ కిషన్ (14) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.  ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రేవిస్ (19 బాల్స్ లో 29) కొన్ని మంచి షాట్లు కొట్టినా.. సగం ఓవర్లకు ముంబై 54/2 మాత్రమే చేసింది.  తర్వాత సూర్యకుమార్, తిలక్ వర్మ స్పీడు పెంచారు. ఉమేశ్ వేసిన 13వ ఓవర్లో సూర్య 4, 6 బాదగా.. కమిన్స్ బౌలింగ్​లో చక్కటి స్కూప్ షాట్ సిక్స్ కొట్టిన తిలక్.. 17వ ఓవర్లోనూ ఓ ఫోర్, సిక్స్​ రాబట్టి  స్కోరు వంద దాటించాడు. అదే జోరుతో సూర్య ఫిఫ్టీ  పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కు సూర్య ఔటైనా.. ఐదు బాల్స్‌‌లోనే మూడు సిక్సర్లు  బాదిన పొలార్డ్ ( 22 నాటౌట్‌‌) ముంబై స్కోరు 160 దాటించాడు.   

వెంకటేశ్‌‌ నిలకడ, కమిన్స్‌‌ మోత
ఛేజింగ్ లో కోల్ కతాకు మంచి ఆరంభం దక్కలేదు.  నింపాదిగా ఆడిన ఓపెనర్​ రహానె (7)ను ఐదో ఓవర్లో ఔట్ చేసిన మిల్స్.. ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. కెప్టెన్​  శ్రేయస్ అయ్యర్ (10) రెండు ఫోర్లు బాదినా తర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లేలో కేకేఆర్ 35/2 మాత్రమే చేసింది. ఆపై వెంకటేశ్ తో కలిసిన బిల్లింగ్స్(17) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ,10వ ఓవర్లో బిల్లింగ్స్ ఔట్ కావడంతో మూడో వికెట్ కు 32 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. నితీశ్ రాణా (8)విఫలమవగా.. ఆడిన రెండో బాల్ నే సిక్స్ బాదిన రసెల్ (11) మిల్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దాంతో కేకేఆర్‌‌ 101/5తో నిలవగా.. ముంబై రేసులోకి వచ్చినట్టు కనిపించింది. చివరి 41 బాల్స్‌‌లో కేకేఆర్‌‌కు 61 రన్స్‌‌ అవసరం అవడంతో ఇరు జట్లకూ సమాన అవకాశాలు కనిపించాయి. కానీ, ఈ టైమ్‌‌లో  క్రీజులోకి వచ్చిన కమిన్స్ భారీ షాట్లతో మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్‌‌ చేశాడు. మిల్స్‌‌ బౌలింగ్‌‌లోనే  సిక్స్, ఫోర్ తో టచ్ లో కనిపించాడు. బుమ్రా బౌలింగ్‌‌లో సింగిల్‌‌తో  వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అదే ఓవర్లో కమిన్స్ మరోసారి 6, 4 బాదాడు. దీంతో కేకేఆర్ కు చివరి 30 బాల్స్ లో 35 రన్స్ అవసరమయ్యాయి. అయితే సామ్స్ వేసిన 16వ ఓవర్లో  నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన కమిన్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు కేకేఆర్ కు విక్టరీ అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు 
ముంబై: 20 ఓవర్లలో 161/4 (సూర్యకుమార్ 52, తిలక్ 38*, కమిన్స్ 2/49)
కోల్ కతా: 16 ఓవర్లలో 162/ 5 (కమిన్స్ 
56 *, వెంకటేశ్ 50 *,  మురుగన్   2/25)