యూఎస్‌లో చాలాచోట్ల కర్ఫ్యూ

యూఎస్‌లో చాలాచోట్ల కర్ఫ్యూ
  • ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు

మినియా పొలిస్‌(అమెరికా): మినియాపొలిస్‌లో పోలీసుల చేతిలో ఆఫ్రికన్‌ ఆమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయిన ఘటనపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. మినియా పొలిస్‌లో ఆందోళనలు ఐదో రోజు కొనసాగాయి. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌, చికాగో, అట్లాంటాల్లో కర్ఫ్యూ విధించారు. జనాలు అంతా ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్‌ గార్డ్‌ సోల్జర్స్‌ చెప్పారు. సియాటెల్‌ నుంచి న్యూయార్క్‌ వరకు వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు ఫైరింగ్‌ చేశారు. చికాగో, న్యూయార్క్‌లలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య గొడవ జరిగింది. ఫిలడల్పియాలో షాపులపై ఆందోళనకారులు దాడి చేశారు. దీనికి అంతటికి వామపక్షలు కారణమని ట్రంప్‌ ఆరోపించారు. ఘటనకు వ్యతిరేకంగా టొరంటో తదితర ప్రాంతాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. మినియాపొలిస్‌లో ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారు. దొంగనోట్లు చలామణి చేస్తున్నాడనే అనుమానంతో జార్జిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే పోలీస్‌ ఆఫీసర్‌‌ డెరెక్‌ చౌవిన్‌ జార్జికి సంకెళ్లు వేసి కిందపడేశాడు. జార్జి మెడపై మోకాలితో నొక్కిపట్టాడు. ఊపిరి ఆడట్లేదు కాలు తీయాలని జార్జి కోరినా, తోటి ఆఫీసర్‌‌ చెప్పినా డెరెక్‌ వినిపించుకోలేదు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జార్జి.. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయాడు.