పెరుగుతున్న కరెన్సీ నోట్ల వాడకం

పెరుగుతున్న కరెన్సీ నోట్ల వాడకం
  • డిజిటల్‌‌‌‌ పేమెంట్లలోనూ దూకుడు
  • కరోనా వల్ల కరెన్సీ వాడకం పెరిగిందన్న ఆర్​బీఐ

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ ముగిసి నేటికి ఐదేళ్లు (2016 నవంబరు 8) అయింది. పెద్దనోట్ల రద్దయ్యాక దేశమంతటా డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ఆన్​లైన్​ పేమెంట్లకు వాడే యూపీఐ, వాలెట్ల వంటివి ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లోకి వచ్చేశాయి. అయితే కరోనా వచ్చాక పరిస్థితి మొదటికి వచ్చింది. గత ఏడాది నుంచి కరెన్సీ నోట్ల వాడకమూ పెరుగుతోంది. మార్కెట్లలో కరెన్సీ చెలామణి విపరీతంగా పెరిగినట్టు ఆర్‌‌‌‌బీఐ గుర్తించింది. ఎందుకంటే కరోనా వల్ల అన్ని వర్గాల జనానికి, ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నో బిజినెస్‌‌‌‌లు మూతబడ్డాయి. ఎంతో మంది జాబ్స్‌‌‌‌కు దూరమయ్యారు. భవిష్యత్‌‌‌‌ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ముందస్తుగా కరెన్సీని దాచిపెట్టుకున్నారు. అందుకే గత ఆర్థిక సంవత్సరం నుంచి నోట్ల చెలామణి బాగా పెరిగింది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్‌‌‌‌ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ప్రకటించింది. దేశంలో అతిపెద్ద డిజిటల్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ సంస్థగా తాము ఎదిగామని పేర్కొంది.   ప్రధాని నరేంద్ర మోడీ ఐదేళ్ల క్రితం పాత రూ. 1,000  రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి,  నల్లధనాన్నిఅరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నంతగా, కరెన్సీ వాడకం పెరగడం లేదని ప్రభుత్వం చెబుతోంది.  

లెక్కలు ఏమంటున్నాయంటే...

రిజర్వ్ బ్యాంక్ తాజా లెక్కల  ప్రకారం, 2016 నవంబరులో రూ. 17.74 లక్షల కోట్ల విలువైన ఎన్‌‌‌‌ఐసీలు (నోట్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ సర్కులేషన్‌‌‌‌) ఉండగా, 2021 అక్టోబర్ 29 నాటికి వీటి విలువ రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగింది.  గత అక్టోబర్ 30 నాటికి వీటి విలువ రూ. 26.88 లక్షల కోట్లుకాగా, 2021 అక్టోబర్ 29 నాటికి మరో రూ. 2,28,963 కోట్లు పెరిగింది. 2020 అక్టోబరు 30 నాటికి వార్షిక పెరుగుదల రూ. 4,57,059 కోట్ల వరకు ఉంది. 2019 నవంబర్  నాటికి ఎన్‌‌‌‌ఐసీల విలువ సంవత్సరానికి రూ. 2,84,451 కోట్లు పెరిగింది. 2019–-20లో ఎన్ఐసీ విలువ, నోట్ల సంఖ్య వరుసగా 14.7 శాతం,  6.6 శాతం పెరిగాయి. 2020–-21లో ఇవి వరుసగా 16.8 శాతం 7.2 శాతం పెరిగాయి. 2020-–21 మధ్యకాలంలో నోట్ల వాడకం ఇంకా పెరిగింది. మహమ్మారి కారణంగా ప్రజలు ముందుజాగ్రత్తగా నగదును దాచి పెట్టుకోవడమే ఇందుకు ముఖ్యకారణం.  2014 అక్టోబర్ నుండి 2016 అక్టోబర్  వరకు అంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు నెల వరకు.. ఎన్ఐసీ సంవత్సరానికి సగటున 14.51 శాతం పెరిగింది. నోట్ల వాడకాన్ని తగ్గించడం, డిజిటల్ పేమెంట్లను పెంచడానికి  2016లో యూపీఐని మొదలుపెట్టారు. ఈ విధానంలో డబ్బులు చెల్లించడం ఈజీ కాబట్టి యూపీఐ  ట్రాన్సాక్షన్లు నెలానెలా పెరుగుతున్నాయి. 2021 అక్టోబర్‌‌‌‌లో  ట్రాన్సాక్షన్లు విలువ రూ. 7.71 లక్షల కోట్లకు చేరింది.

చిన్న ఖర్చులకు నోట్లే వాడుతున్నారు

నోట్ల వాడకం గురించి తెలుసుకోవడానికి ఆర్‌‌‌‌బీఐ ఆరు నగరాల్లో ప్రత్యేక సర్వే చేయించింది. కస్టమర్ల రిటైల్ చెల్లింపులను స్టడీ చేసింది.  దీని ఫలితాలను 2021 ఏప్రిల్‌‌‌‌లో వెల్లడించింది. సాధారణ ఖర్చుల కోసం,  రూ. 500లోపు విలువైన చెల్లింపుల కోసం కరెన్సీ నోట్లను వాడేందుకే జనం ఇష్టపడుతున్నారని ఈ స్టడీ తేల్చింది.  విలువ పరంగా చూస్తే రూ. 500,  రూ. 2,000 నోట్ల వాటా 2021 మార్చి నాటికి చెలామణిలో ఉన్న కరెన్సీలో 85.7 శాతం ఉంది. 2020 మార్చి  నాటికి ఇది 83.4 శాతమే ఉంది. డీమోనిటైజేషన్‌‌‌‌ తరువాత ఆర్‌‌‌‌బీఐ రూ.రెండు వేల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే  కొత్తగా రూ.2,000 నోట్ల ప్రింట్‌‌‌‌ చేయాలని 2019 నుంచి ఇప్పటి వరకు భారతీయ రిజర్వ్‌‌‌‌ బ్యాంక్ నోట్‌‌‌‌ ముద్రణ్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కు ఆదేశాలు ఇవ్వలేదు. మనదేశంలో ప్రస్తుతం రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2,000 నోట్లు ఉన్నాయి.