జనానికి మరో షాక్.. కస్టమర్​ చార్జీల పెంపు!

జనానికి మరో షాక్.. కస్టమర్​ చార్జీల పెంపు!
  • ఆమ్దానీ పెంచుకునేందుకు డిస్కంల పరోక్ష వడ్డింపు 
  • పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.320 కోట్ల భారం
  • కోటి 10 లక్షల కుటుంబాలపై ప్రభావం 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మే నెల నుంచి కరెంట్​బిల్లులు భారీగా పెరగనున్నాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్​కు నేరుగా 50 పైసలు పెంచనున్నట్లు ప్రకటించిన డిస్కంలు.. పరోక్షంగా కస్టమర్​ చార్జీలను కూడా పెద్ద మొత్తంలో పెంచేశాయి. 50 యూనిట్ల వరకు ఇప్పుడున్న రూ.25 కస్టమర్​చార్జీని రూ.40కి, 51 నుంచి100 యూనిట్ల వరకు ఇప్పుడున్న రూ.30 కస్టమర్​ చార్జీని రెట్టింపు చేసి రూ.70 చేశాయి. ఫలితంగా 200 యూనిట్ల వరకు కరెంట్​వాడే పేద, మధ్యతరగతి కుటుంబాలపై కస్టమర్ ​చార్జీల రూపంలోనే రూ.320 కోట్ల మేర భారం పడనుంది. డిస్కంల చార్జీల పెంపు ప్రతిపాదనలకు ఈఆర్‌‌సీ ఆమోదం తెలిపితే ఏప్రిల్‌‌ నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా ప్రకటించిన టారీఫ్​ను పరిశీలిస్తే చార్జీల పెంపు భారం స్పష్టమవుతోంది. 50 యూనిట్లు వాడిన ఓ కుటుంబానికి యూనిట్ చార్జీ రూ.1.45 చొప్పున ప్రస్తుతం రూ.72.50 , కస్టమర్ చార్జీలు రూ.25, ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్ చార్జీల పై 6 శాతంతో మొత్తం రూ.101.85 వరకు వస్తుంది. పెరిగిన చార్జీలతో యూనిట్ రూ.1.95 చొప్పున 50 యూనిట్లకు  రూ.97.50, కస్టమర్ చార్జీలు రూ.40, ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూనిట్ చార్జీల పై 6 శాతం రూ.5.85తో కలిపి మొత్తం రూ.143.35 కానుంది. దాదాపు 40 నుంచి 50 శాతం వరకు చార్జీలు పెరిగే అవకాశం ఉంది.

అదనపు భారం..
గృహ వినియోగదారులపై కస్టమర్‌‌ చార్జీల భారం భారీగా పడనుంది. ప్రస్తుతం డొమెస్టిక్‌‌ కేటగిరీలో 0–50 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి కస్టమర్‌‌ చార్జీ రూ.25 ఉంది. తాజా టారీఫ్‌‌లో దీన్ని రూ.40కి పెంచారు. 51–100 యూనిట్ల కరెంటు వాడే వారికి ప్రస్తుతం రూ.30 ఉండగా అది రూ.70కి పెరుగుతుంది. అంటే డబుల్‌‌ కంటే ఎక్కువే. ఇలా ఒక్కో శ్లాబ్​కు ఒక్కో రకంగా కస్టమర్​చార్జీలు పెంపును ప్రతిపాదించాయి. కస్టర్‌‌ చార్జీలు పేరుతో కోటి10 లక్షల కుటుంబాలపై డిస్కంలు భారం మోపనున్నాయి. సగటున 201 యూనిట్లకు పైగా వాడే వినియోగారులే అధికంగా ఉంటారు. పెంచనున్న చార్జీలతో మధ్యతరగతి ప్రజలపై  అధికభారం పడనుంది. వీరంతా దాదాపు60 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం కస్టమర్‌‌చార్జీ రూ.60 ఉండగా ఇప్పుడు రూ.100 అయింది. అంటే ఒక్క సారిగా రూ.40 భారం పడింది. మధ్యతరగతి ప్రజలపైనే ఏటా రూ.248 కోట్లు భారం పడనుంది. 0–50 యూనిట్లు వాడే 40 లక్షల మంది పేదలపై రూ.72 కోట్లు ఇలా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై  ఏడాదికి రూ.320 కోట్ల భారం పడనుంది.