ఎన్నికలు అయిపోయినంక రాష్ట్రంలో కరెంట్ కోతలు

ఎన్నికలు అయిపోయినంక రాష్ట్రంలో కరెంట్ కోతలు
  •  మాజీ మంత్రి హరీశ్‌‌ రావు

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరుగుతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడం వల్లే కరెంట్ ఇస్తున్నారని ఆయన అన్నారు. తాను శుక్రవారం ఓ ఊరుకు వెళ్లానని, కరెంట్ ఉండటం లేదని అక్కడి రైతులు తనతో  చెప్పారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో బాధలు లేకుండా చూసుకున్నామని, కాంగ్రెస్ వచ్చీరాగానే ప్రజలకు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌‌లో ఆయనను  జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిశారు. పార్లమెంట్‌‌ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వాలని  వినతిపత్రం ఇచ్చారు. 

అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్ మాట్లాడారు. మున్నూరు కాపుల వినతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గతంలోనూ చాలా మంది మున్నూరు కాపు నేతలకు అవకాశం కల్పించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు‌‌లో రైతులకు కష్టాలు మొదలయ్యాయని.. వడ్ల బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బంధు విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలోనే ఉన్నారని తెలిపారు.

 ‘ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఆ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే దిగేదేమి లేదు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్​ఎస్​ను గెలిపించాలి’ అని కాపులకు హరీశ్ విజ్ఞప్తి చేశారు. రెండుసార్లు గెలిపిస్తే పార్టీని బీబీ పాటిల్ మోసం చేశాడని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని హరీశ్​ పిలుపునిచ్చారు.