తెలంగాణ నుంచి కరెంట్​ బకాయిలు ఇప్పించండి.. ఆర్కే సింగ్​ను కోరిన ఏపీ సీఎం

తెలంగాణ నుంచి కరెంట్​ బకాయిలు ఇప్పించండి.. ఆర్కే సింగ్​ను కోరిన ఏపీ సీఎం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీకి చేరుకున్న జగన్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 7,230.14 కోట్ల విద్యుత్ బకాయిలను అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. కాగా, స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ తొలిసారి ఢిల్లీ వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అవుతారని ఏపీ భవన్ అధికార వర్గాలు తెలిపాయి.