సీఎంఆర్  దందా! మిల్లు లేకుండానే బీఆర్ఎస్​ నేత ​గోదాంకు వడ్ల కేటాయింపు

సీఎంఆర్  దందా! మిల్లు లేకుండానే బీఆర్ఎస్​ నేత ​గోదాంకు వడ్ల కేటాయింపు
  • వడ్లు ఆడించకుండానే రీసైక్లింగ్ ద్వారా బియ్యం అందజేత
  • వనపర్తి డీఎస్ వో సరెండర్

వనపర్తి, వెలుగు: రైతుల నుంచి  ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి అప్పగించేందుకు  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కస్టమ్ మిల్లింగ్  రైస్( సీఎంఆర్) అక్రమార్కులకు వరంగా మారింది. వనపర్తి జిల్లాలో గత సీజన్  నుంచి రైస్  మిల్లుకు బదులుగా ఓ గోదాంకు వడ్లు కేటాయించి అధికారులు దందా నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లు వడ్లను ఆడించకుండానే ఇతర రాష్ట్రాల్లో అమ్ముకొని, వాటి బదులుగా రేషన్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా వనపర్తి సమీపంలోని చిట్యాలలో ఓ గోదాంను రైస్ మిల్ గా చూపించి వడ్లు కేటాయించిన ఘటన వెలుగు చూడడంతో కలెక్టర్ డీఎస్ వోను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. చిట్యాలలోని గోదాంను సీజ్  చేసి అందులోని వడ్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. 

బీఆర్ఎస్  నేత గోదాంకు సీఎంఆర్..

వనపర్తికి పక్కను ఉన్న చిట్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్  పార్టీ లీడర్ గోదాంలో అక్రమంగా సీఎంఆర్ వడ్లు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ రైస్ మిల్ లేకున్నా, మిల్లుగా చూపించి అధికారులు గత సీజన్  నుంచి వడ్లు కేటాయిస్తు వస్తున్నారు. గత సీజన్ లో 2,644 మెట్రిక్  టన్నుల వడ్లు కేటాయించగా, కరెంట్ కనెక్షన్, రైస్ మిల్లింగ్ పరికరాలు లేని వీరి నుంచి 1,772 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరపరాల శాఖకు  ఇవ్వాల్సి ఉంది. రేషన్  దుకాణాల నుంచి రీసైక్లింగ్ పద్దతిలో బియ్యాన్ని సేకరించి కొంత మేర అందించారు. ఈ సీజన్ లోనూ వడ్లు కేటాయించేందుకు దరఖాస్తు చేయగా, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదులు వచ్చాయి. వారం రోజుల కింద ఆయన విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్​వో సుదర్శన్​  ఈ నెల1 నుంచి లాంగ్ లీవ్  పెడుతున్నట్లు సిబ్బందికి చెప్పి కలెక్టర్ కు సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. దీంతో డీఎస్ వో బాధ్యతలను డీఎం కొండల్ రావుకు అప్పగించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డీఎస్ వో సుదర్శన్ ను ప్రభుత్వానికి సరెండర్  చేసినట్లు కలెక్టరేట్​ వర్గాలు తెలిపాయి. 

కోటా పూర్తి చేయని మిల్లర్లకు చెక్..

గతంలో వడ్లు తీసుకొని తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వని రైస్  మిల్లులకు యాసంగి వడ్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. జిల్లాలో 120 రైస్  మిల్లులకు గత సీజన్ లో 640 మెట్రిక్  టన్నుల వడ్లను సీఎంఆర్  రైస్ గా మార్చి ఇవ్వాల్సి ఉండగా, 15 మిల్లులే పూర్తి స్థాయిలో అప్పగించాయి. మిగిలిన మిల్లులు బియ్యం ఇచ్చే విషయంలో అధికారులకు సహకరించడం లేదు. యాసంగిలో జిల్లాలో 1.59 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. అయితే నిబంధనలు పాటించని మిల్లర్లకు ఈసారి వడ్లు ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. 
ఇదిలాఉంటే సివిల్  సప్లై ఆఫీసర్లకు వడ్ల సేకరణ సవాల్ గా మారింది. పోయిన సీజన్ కు సంబంధించిన సీఎంఆర్  ఇవ్వకపోవడంతో నిషేధిత జాబితాలో చేరిన మిల్లులకు వడ్లు పంపమని చెబుతున్నారు. అయితే వడ్లను నిల్వ చేసేందుకు అవసరమైన గోదాంలు లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల కొనుగోలు చేసిన వడ్లను అక్కడే ఉంచారు.  

అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

జిల్లాలోని రైస్  మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను అమ్ముకొని, రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్  చేసిట్లు నిర్ధారణ అయితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్  ఆదేశించారు. చిట్యాలలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం. త్వరలో బాధ్యులపై చర్యలు ఉంటాయి. 
- కొండల్ రావు, ఇన్​చార్జి డీఎస్ వో, వనపర్తి