
గోదావరిఖని, వెలుగు: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని తల, చేతులు, శరీరాన్ని వేరువేరు చేసి చెట్ల పొదల్లో విసిరేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సమీపంలోని కాజిపల్లి గ్రామంలో నివసించే కాంపెల్లి శంకర్(35) గోదావరిఖని విఠల్‌నగర్ మీ సేవా సెంటర్‌లో కాంట్రాక్టు ఉద్యోగి. ఈయన భార్య హేమలత ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్‌లో కాంట్రాక్టు నర్సుగా చేస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు శంకర్ తన భార్యను హాస్పిటల్‌లో డ్యూటీ కోసం తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు. సెల్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండడం, వెతికినా జాడ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు ఎన్టీపీసీ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రామగుండం మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారి పక్కన ఓ వ్యక్తికి శనివారం కట్ చేసిన మనిషి చేయి కనిపించింది. పోలీసులు అదే ప్రాంతంలో ఎన్టీపీసీ ప్లాంట్ గోడకు ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లో వెతకగా శంకర్ తల, మరికొద్ది దూరంలో మరో చేయి లభించింది. మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌కు వెళ్లే దారిలో మొండెం దొరికింది. కాళ్లు దొరకలేదు. ఎన్టీపీసీ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే రాజుపై అనుమానంతో పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. శంకర్ హంతకులను పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు కాంపెల్లి ప్రసాద్, పల్లె బాపు ఆధ్వర్యంలో ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టారు.