ENG vs PAK: సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి: పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ వింత సలహా

ENG vs PAK: సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి: పాక్ క్రికెటర్లకు వసీం అక్రమ్ వింత సలహా

తొలుత రెండింటిలో విజయం.. అనంతరం వరుసగా నాలుగు ఓటములు.. ఆపై మరో రెండింట గెలుపులు.. ఇది వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ప్రయాణం. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన పాక్ నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంకో మ్యాచ్ ఆడాల్సిఉన్నా.. అందులో ఫలితం నామమాత్రమే. 

గురువారం శ్రీలంకపై విజయంతో కివీస్ జట్టు రెండు పాయింట్లుతన ఖాతాలో వేసుకోవడమే కాకుండా నెట్ ర‌న్‌రేట్‌ను(+0.743) మెరుగుపరుచుకుంది. దీంతో బాబ‌ర్ సేన‌కు సెమీస్ త‌లుపులు దాదాపు మూసుకుపోయాయి. అయితే, ఆఖ‌రి మ్యాచ్‌లో బాబ‌ర్ సేన‌.. ఇంగ్లాండ్‌పై అద్బుతం చేస్తే సెమీస్ రేసులో నిలవచ్చు. అదెలా అంటే, ఈ మ్యాచ్‌లో పాక్ మొద‌ట బ్యాటింగ్ చేస్తే 287 ప‌రుగుల తేడాతో విజయం సాధించాలి. ఒక‌వేళ ఛేజింగ్ చేయాల్సి వ‌స్తే.. 284 బంతులు అంటే 47 ఓవ‌ర్లు మిగిలుండ‌గానే చేధించాలి. ఈ రెండూ అసాధ్యం కనుక ఆ జట్టు మాజీ దిగ్గజం వసీం అక్రమ్ వారికో వింత సలహా ఇచ్చారు. 

టైమ్‍డ్ ఔట్ ఒక్కటే దారి..!

పాకిస్థాన్‌కు చెందిన ఓ స్పోర్ట్స్‌ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న అక్రమ్.. పాక్ కు సెమీస్ అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. తాను చెప్పినట్లు చేస్తే అది సాధ్యమేనని వెల్లడించారు. "ఈ మ్యాచ్‌లో మొదట బాబర్ ఆజం చేయాల్సింది.. టాస్ గెలవడం. అందులో నెగ్గగానే మొదట బ్యాటింగ్ ఎంచుకొని.. ఇంగ్లాండ్ ముందు సరైన లక్ష్యాన్ని నిర్ధేశించాలి. అనంతరం ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్తారు. ఆ సమయంలో మీరూ వారిని అనుసరించండి. వారు లోపలకి వెళ్లగానే బయటనుంచి తాళం వేయండి. అప్పుడు వారు లోపల ఉండిపోతారు. మనం 'టైమ్‍డ్ అవుట్' నిబంధన ప్రకారం విజయం సాధించవచ్చు.." అని అక్రమ్ పాక్ క్రికెటర్లకు పాక్ ఆటగాళ్లకు వింత సలహా ఇచ్చారు. ఈ సలహాను నెటిజన్స్ అంగీకరిస్తున్నారు. పాక్ క్రికెటర్లు ఈ పనిని సమర్ధవంతంగా చేయగలరని కామెంట్స్ చేస్తున్నారు.

మరొక మార్గం..!

నిజానికి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడానికి పాకిస్తాన్‌కు మరో మార్గం ఉంది. అదేంటంటే, మొదట బ్యాటింగ్ ఎంచుకొని ఇంగ్లండ్‌పై 400 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలగాలి. ఆపై వారిని 112 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఇది సాధ్యమే. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన పెద్దగా ఏమీ లేదు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించారు. కావున వారు అక్రమ్ పిచ్చి సలహాలు మాని ఈ దిశగా ఆలోచించాలి.