Cricket World Cup 2023: బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‍ మ్యాచ్‍కు పాండ్యా దూరం

Cricket World Cup 2023: బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‍ మ్యాచ్‍కు  పాండ్యా దూరం

భారత అభిమానులకు చేదువార్త ఇది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి సమయం పట్టేలా ఉంది. గాయం తీవ్రత పెద్దది కాకపోయినా.. అతను సరిగ్గా నడవలేకపోతున్నాడట. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు కుంటుతూ నడుస్తున్నట్లు కేఎల్ రాహుల్ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాండ్యా పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. అదే జరిగితే వరుస విజయాలతో జోరుమీదన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లే. 

అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో పాండ్యా వంద శాతం ఆడడు. శుక్రవారం మధ్యాహ్నం భారత బృందం ధర్మశాలకు చేరుకోగా.. పాండ్యా వారితో వెళ్ళలేదు. అతన్ని బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)కి తరలించనున్నట్లు సమాచారం. కొన్నిరోజుల పాటు పాండ్యా ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి.

న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం భారత్ తదుపరి మ్యాచ్.. అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో జరగనుంది. ఆ సమయానికి అతడు కోలుకుంటే జట్టులో చూడవచ్చు.

అగ్రస్థానంలో న్యూజిలాండ్‌

ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ మాత్రమే అన్నింటా విజయం సాధించాయి. న్యూజిలాండ్‌ జట్టు..  ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ పై విజయం సాధించగా, భారత జట్టు.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ పై విజయం సాధించింది. ఇరు జట్లు ఎనిమిదేసి పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ.. మెరుగైన రన్ రేట్ తో కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌ రెండో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లు మూడు.. నాలుగు స్థానాల్లో ఉన్నాయి.