ENG vs PAK: ధైర్యం కోల్పోకండి మిత్రులారా.. ఇంగ్లాండ్‌ను భయపెట్టండి: పాక్ ఆల్‌రౌండర్

ENG vs PAK: ధైర్యం కోల్పోకండి మిత్రులారా.. ఇంగ్లాండ్‌ను భయపెట్టండి: పాక్ ఆల్‌రౌండర్

పాకిస్తాన్.. పాకిస్తాన్.. వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైననాటి నుంచి అందరి కళ్లు ఈ జట్టుపైనే. ముఖ్యంగా మీడియా. వారు ఉండే చోటు మొదలు వారు తినే తిండి వరకు.. ఏం చేస్తున్నారు..? ఎక్కడ తిరుగుతున్నారు..? ముక్కలు రుచి చూశారా లేదా? అంటూ రోజుకో కథనం. ఇలా వారికి ద్రిష్టి పెట్టి చివరకు ఇంటికి సాగనంపారు. ఇక రేపో.. మాపో.. వట్టి చేతులతో స్వదేశానికి బయలుదేరిన పాక్ క్రికెటర్లు అని చివరి కథనం కూడా రాస్తారు. ఈ విషయం మీకూ తెలుసు. 

ఈ వార్తలను ఆ జట్టు ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం ముందే పసిగట్టాడు. అందుకే ఇకనైనా మేలుకోండి మిత్రులారా పరువు నిలబెట్టుకుందాం  అంటూ ఒక సందేశం పంపాడు. కోల్పోవడానికి ఇంకేం మిగలలేదు.. ఇంగ్లాండ్‌ను భయపెట్టి విజయం సాధించండి అంటూ వారిలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశాడు. 

పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో నవంబర్‌ 11న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్.. ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించడం కానీ, లేదంటే ఇంగ్లాండ్ నిర్ధేశించే లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో ఛేదించడం కానీ జరగాలి. అలా అయితేనే పాక్ రన్‌రేట్‌ పరంగా కివీస్‌ను కిందకునెట్టి నాలుగో స్థానానికి చేరుకోగలదు. ఇది అసాధ్యం అయినప్పటికీ.. ధైర్యం కోల్పోవద్దని ఇమాద్ వసీం.. పాక్ క్రికెటర్లకు సూచించాడు. కోల్పోవడానికి ఇంకేం మిగలలేదు.. ఇంగ్లాండ్ ను భయపెట్టేలా ఆడండి అని వారికి సలహా ఇచ్చాడు. 

"మనం కోల్పోవడానికి ఇంకేం మిగలలేదు.. ఇంగ్లండ్‌పై భయం లేకుండా ఆడండి.. వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం.." అని ఇమాద్ వసిమ్ ఓ పాక్ మీడియా ఛానెల్ డిబేట్‪లో మాట్లాడారు. ఈ మాటలు నెటిజెన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే అంటూ అతనికి సామెత అర్థాన్ని వివరిస్తున్నారు.

ఇప్పటివరకూ ఈ  టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన పాక్ నాలుగింట మాత్రమే విజయం సాధించింది.