
- అధికారం కోసం బీజేపీ డర్టీ పాలిటిక్స్చేస్తున్నదని ఫైర్
- ట్రంప్‌తో మోదీ ఫ్రెండ్షిప్ వల్లే ఈ టారిఫ్‌లు: ఖర్గే
- విదేశాంగ విధానాలు పతనమయ్యాయి: రాహుల్
- బీసీల వాటా కోసం పోరాటంలో తెలంగాణ ఆదర్శం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, దామోదర
పాట్నా: బిహార్‌లో కేంద్ర ప్రభుత్వం చేపడ్తున్న ఓటర్ల సమగ్ర సవరణ (సర్).. ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని కాంగ్రెస్ విమర్శించింది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో బీజేపీ.. డర్టీ ట్రిక్స్‌కు పాల్పడుతున్నదని మండిపడింది. ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నదని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పాట్నాలోని పార్టీ స్టేట్ ఆఫీస్ (సదాఖత్ ఆశ్రమ్)లో ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ట్రెజరర్ అజయ్ మాకెన్, జనరల్ సెక్రటరీలు కేసీ.వేణుగోపాల్, జైరామ్ రమేశ్, సచిన్ పైలెట్, బిహార్ స్టేట్ పార్టీ చీఫ్ రాజేశ్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ భేటీలో రాజ్యాంగాన్ని కాపాడటం, బిహార్‌లో చేపడ్తున్న సర్‌కు వ్యతిరేకంగా పోరాటంపై తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, బిహార్‌లో అమలు చేయనున్న ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ వంటి కీలక అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేపడ్తున్న ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. వచ్చే నెల్లో రాహుల్ గాంధీ.. ఓట్ల చోరీ అంశంపై మరిన్ని ఆధారాలు బయటపెడ్తారని, అవి ‘హైడ్రోజన్ బాంబ్’, ‘మినీ హైడ్రోజన్ బాంబ్’, ‘ప్లుటోనియం బాంబ్’లా పేలుతాయని తెలిపారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లుతున్నది
కేంద్రం, బిహార్‌లో ఉన్న ఎన్డీయే కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని జైరామ్ రమేశ్ అన్నారు. బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీ, ఓటర్ల జాబితాలో అవకతవకలతో ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయి. కేంద్రం వైఖరి కారణంగా ప్రజలకు డెమోక్రసీపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతున్నది. ప్రజా స్వామ్యాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
రాహుల్ గాంధీ ఎంతో ధైర్యంగా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాక్ష్యాలతో సహా ఈసీ, బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీని రాహుల్ బట్టబయలు చేశారు. దీనికిగాను సీడబ్ల్యూసీ తరఫున రాహుల్ గాంధీకి సెల్యూట్ చేస్తూ తీర్మానం చేస్తున్నం. బీజేపీ ఓ పద్ధతిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నది. ఆ పార్టీ కుట్రను కాంగ్రెస్ బహిర్గతం చేసింది. మోసపూరితంగా, ఓటర్ల జాబితాలను తారుమారు చేసి ఏర్పాటైన ప్రభుత్వానికి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదు’’అని జైరామ్ రమేశ్ అన్నారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ఓటర్లను మోసం చేస్తూ.. వారి నమ్మకానికి తూట్లు పొడుస్తూ బీజేపీ అధికారంలోకి వస్తున్నదని జైరామ్ రమేశ్ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలకు జవాబుదారీతనం లేనప్పుడు నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం పెరుగుతాయి. హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్లు నాశనం అవుతాయి. మౌలిక వసతుల గురించి పట్టించుకునేవాళ్లు ఉండరు.
ప్రజా సేవతో కాకుండా.. మోసం చేసి, భయపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నవాళ్లు ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు’’అని జైరామ్ రమేశ్ విమర్శించారు. రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతపై దాడుల నుంచి ఓట్ల చోరీ విడదీయరానిదని అన్నారు. బిహార్ నుంచి ఎన్డీయేను తరిమికొట్టేందుకు పేదలు, కార్మికులు, యువకులు, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
హక్కులపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటది
బిహార్ ఓటర్లంతా ఏకమై.. తమ ఓటు శక్తిని గుర్తించాలని జైరామ్ రమేశ్ కోరారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ లోపల.. ఇటు వీధుల్లోనూ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బిహార్‌లోని ప్రతి పౌరుడితో పాటు దేశ ప్రజలందరికీ సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించారు. ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదానికి బిహార్ యువకులు మద్దతివ్వాలని కోరారు. ‘సర్’ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దీన్ని కలిసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇండియా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నది: ఖర్గే
ఇండియా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీయే అని మండిపడ్డారు. విదేశాంగ విధానాలు కుప్పకూలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ట్రంప్.. నా ఫ్రెండ్’ అని చెప్పుకునే మోదీకి.. టారిఫ్‌లు, హెచ్1బీ వీసాల ఫీజులు కనిపించడం లేవా? అని ప్రశ్నించారు. ట్రంప్‌తో మోదీ ఫ్రెండ్షిప్.. దేశాన్ని సమస్యల్లోకి నెట్టేసిందన్నారు. ఈసీ, బీజేపీ కలిసి బిహార్‌లో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.