సైబర్ ​నేరగాళ్ల వలలో చిక్కి.. రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నడు

సైబర్ ​నేరగాళ్ల వలలో చిక్కి.. రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నడు

వైరా, వెలుగు: సైబర్​నేరగాళ్ల వలలో చిక్కి ఓ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీ రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నాడు. వైరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరాలోని పాత బస్టాండ్ కు చెందిన చౌడవరపు ఫణికుమార్ సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. ఫణి కుమార్ ఫోన్ కు ఈ నెల 23న రేష్మ అనే యువతి నుంచి మెసేజ్ వచ్చింది. మీరు పార్ట్ టైం ఉద్యోగం ద్వారా రోజుకు రూ. 1000 నుంచి రూ.2,500 సంపాదించే అవకాశం ఉందని పేర్కొంది. ఫణి కుమార్ నంబర్ ను టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేసింది. అందులో యూట్యూబ్ వీడియోలు పంపించి చూడమని చెప్పింది. ఆ వీడియోలు చూసినందుకు ఒక్కో వీడియోకు రూ.50 చొప్పున 20 వీడియోలకు రూ.1000 బ్యాంకు అకౌంటుకు ట్రాన్స్​ఫర్ చేసింది. తర్వాత వెబ్​సైట్లో రిజిష్టర్ కావాలని, అందులో పెట్టుబడి పెడితే మీ డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని చెప్పింది.

దాంతో ఫణికుమార్​మార్చి 23న రూ.5,000 యూపీఐ ద్వారా ఆమెకు పంపాడు. తర్వాత రూ.30,000 పంపించాడు. అనుమానం వచ్చి నగదును విత్ డ్రా చేసుకుంటానని చెప్పగా మూడు టాస్క్ లు పూర్తి చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం టాస్క్​ల పేరుతో పలు దఫాల్లో రూ. 7.80 లక్షలు ఫణి కుమార్ నుంచి ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన ఫణి కుమార్ సైబర్ క్రైమ్ తోపాటు వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.