స్మార్ట్‌‌గా దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

స్మార్ట్‌‌గా  దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు

ఫేక్ వెబ్ ​పేజ్​లను క్రియేట్ చేస్తూ సైబర్ నేరగాళ్ల మోసాలు

 ‘మాదాపూర్​లో ఉండే అనూషకు గత నెల ఇన్ స్టాగ్రామ్​లో ఒక షాపింగ్ వెబ్ సైట్ లింక్ కనిపించింది. అందులో చాలా తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండటంతో లింక్ పై క్లిక్ చేసి వెబ్‌‌సైట్‌‌లోనే తన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఆర్డర్ పెట్టింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేకపోయినా తక్కువ ధరకే ఆఫర్‌‌‌‌లో ప్రొడక్ట్స్ వస్తున్నాయని.. ఆన్ లైన్ పేమెంట్ చేసింది. డెలివరీ డేట్ దాటిపోయినా ప్రొడక్ట్స్ రాకపోవడంతో వెబ్ సైట్ పేజ్ ఓపెన్ చేసి సపోర్ట్ కాంటాక్ట్ కోసం వెతికింది. ఎంతకీ దొరక్కపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని సైబర్​క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.’

హైదరాబాద్, వెలుగు: స్మార్ట్​ఫోన్‌‌లోని యాప్‌‌లతోనే స్మార్ట్‌‌గా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రస్తుతం యాప్‌‌లను విపరీతంగా వాడటం కామన్‌‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్‌‌లు, వెబ్‌‌సైట్లను డిజైన్ చేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అసలుదేదో, నకీలీదేదో తెలుసుకోలేనంత ఆకర్షణీయంగా యాప్​లను డిజైన్ చేస్తున్నారు. ఒక్క అక్షరం మార్చి యూజర్లను ఏమారుస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో లక్షల సంఖ్యలో యాప్‌‌లు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఒరిజినల్ లేదో ఫేక్‌‌ ఏదో తెలుసుకోకుండానే చాలామంది ఈ యాప్‌‌లను ఇన్‌‌స్టాల్ చేసుకుని వాడుతున్నారు. ఈ యాప్‌‌లకు ఇచ్చే పర్మిషన్లతోనే యూజర్ల పూర్తి డేటాను రాబట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి మోసాల నుంచి అలర్ట్​గా ఉండాలని, ఒక యాప్‌‌ డౌన్‌‌లోడ్ చేసుకునే ముందు అన్నింటినీ పరిశీలించాలని ఐటీ ఎక్స్​పర్ట్స్, యాప్‌‌ డెవలపర్లు సూచిస్తున్నారు. 

యాప్ రేటింగ్స్ చూసుకోకుండానే..

ఫేస్​బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా పేజీల్లో షాపింగ్, ఆన్​లైన్ ఫుడ్, గ్రాసరీస్​కు సంబంధించి ఏ లింక్ అట్రాక్టివ్​గా కనిపించినా యూజర్లు వెంటనే ప్లే స్టోర్​లోకి వెళ్లి ఇన్​స్టాల్ చేసేసుకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్స్ ను క్రియేట్ చేసి మోసాలు చేస్తున్నారు. ఇలాంటి యాప్స్ ఇన్​స్టాల్ చేసే ముందే యూజర్ ఫోన్ కు సంబంధించి అన్ని పర్మిషన్లను యాక్సెప్ట్ చేసేలా చేస్తున్నారు. దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్లను హ్యాక్ చేసి డేటా చోరీకి పాల్పడే అవకాశాలుంటాయని ఐటీ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఒక యాప్​ను మొబైల్​లో ఇన్‌‌స్టాల్ చేసుకునే సమయంలో రేటింగ్స్​ చూడాలని.. డిస్క్రిప్షన్, యూజర్ల రివ్యూలను చదివి అది ఒరిజినలా కాదా అని చెక్ చేసుకోవాలని డెవలపర్లు సూచిస్తున్నారు.   

యూఆర్ఎల్​తో..

ఒకే రకమైన పేరుతో యాప్‌‌లు ప్లే స్టోర్‌‌‌‌లో చాలా ఉంటాయి. వాటిలో అసలుదేదో తెలుసుకోవాలంటే ఇందుకోసం కొంత టైమ్ కేటాయించాలని డెవలపర్లు చెప్తున్నారు. యాప్​ను డౌన్‌‌లోడ్ చేసుకునే ముందు రేటింగ్, గత యూజర్ల రివ్యూలను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. దీంతో పాటు ఆ యాప్​కు వెబ్ సైట్ ఉందా లేదా అనేది పరిశీలించాలని చెప్తున్నారు.  ఇక వెబ్‌‌ సైట్లకు సంబంధించి యూఆర్‌‌‌‌ఎల్(యూనిఫామ్ రీసోర్స్ లోకేటర్) ద్వారా ఒరిజినల్, ఫేక్ అనేది తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ప్రతి యాప్‌‌కు, వెబ్‌‌సైట్​కు సెపరేట్​గా యూఆర్‌‌‌‌ఎల్ ఉంటుంది. ఒరిజినల్​ను ఫేక్ చేయాలని అనుకున్నప్పుడు వారు యూఆర్‌‌‌‌ఎల్ లింక్​ను తమకు అనుగుణంగా క్రియేట్ చేస్తారు.  https://accounts.google.comతో స్టార్ట్ అయితే అది ఒరిజినల్ వెబ్​సైట్ జీ-మెయిల్‌‌ అని.. లేకపోతే ఫేక్ అని సైబర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

తెలియని లింక్​లను ఓపెన్ చేయొద్దు

గుర్తు తెలియని లింక్​లను క్లిక్ చేయొద్దు. ఆన్​లైన్​లో కనిపించే ప్రతి యాప్​ను నిజమని నమ్మకూడదు. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో యాప్‌‌ ఇన్​స్టాల్ చేసుకునేటప్పుడు రేటింగ్స్ గమనించాలి.  సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నందున జనాలు అలర్ట్​గా ఉండాలి. ఎలాంటి సైబర్ మోసాలు జరిగినా 1930 టోల్ ఫ్రీ నంబర్​కు 
కాల్ చేయాలి.  

 -కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్

ఈ– కామర్స్ సైట్ల వాడకం పెరిగింది

ప్రస్తుతం ఈ– కామర్స్ సైట్ల వాడకం పెరిగింది. చాలా యాప్‌‌లు పుట్టుకొస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్నీ పరిశీలించిన తర్వాతే యాప్‌‌లకు గూగుల్ పర్మిషన్ ఇస్తోంది. కానీ ఇప్పటికే వేలసంఖ్యలో ఉన్న యాప్‌‌లలో ఏది ఒరిజినల్,  ఏది ఫేక్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు యూజర్లు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఇన్‌‌ స్టాగ్రామ్‌‌, ఫేస్ బుక్​లో ఆన్​లైన్ షాపింగ్​కు సంబంధించి లింక్ అట్రాక్టివ్​గా కనిపిస్తే వెంటనే ఆ యాప్​ను ఇన్‌‌స్టాల్ చేసుకోకూడదు. యాప్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవాలి. రివ్యూలను గమనించి ఇన్​స్టాల్ చేసుకోవాలి.  ఆ తర్వాత కూడా యాప్‌‌ ఫక్షనింగ్ జెన్యూన్​గా ఉంటేనే మొబైల్ లోని కాంటాక్ట్, మెసేజ్‌‌లకు పర్మిషన్ ఇవ్వాలి. 

– ఎల్లేశ్, యాప్ డెవలపర్, హైటెక్​సిటీ