ఆరు రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసిన సైబర్ నేరగాళ్లు

ఆరు రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసిన సైబర్ నేరగాళ్లు
  • టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ బాధితులకు బెదిరింపులు
  • విద్యావంతులు సైతం వలలో చిక్కుకుంటున్న వైనం
  • ఐఐటీ పీహెచ్‌‌డీ స్కాలర్‌‌కు  రూ.30 లక్షల టోపీ
  • అలాంటి కాల్స్ కు స్పందించవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్  సూచన 

హైదరాబాద్, వెలుగు: మీ పేరుతో డ్రగ్స్  పార్సిళ్లు వచ్చాయని పోలీసులమంటూ ఫొన్  చేస్తున్నారా? మీకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారా? స్లీపర్‌‌  సెల్స్‌‌ నుంచి ప్రాణహాని ఉందంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారా?  ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే సైబర్  క్రైమ్  పోలీసులను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్  సూచించారు.

ఆరు రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రానీయకుండా

ఇటీవల సైబర్  నేరగాళ్లు ఐఐటీ హైదరాబాద్‌‌  పీహెచ్‌‌డీ స్కాలర్‌‌కు ఫోన్‌‌  చేసి రూ.30 లక్షలు దోచేశారు. అతనికి ఉగ్రవాదులతో జాయింట్‌‌  అకౌంట్‌‌  ఉందని, అందులో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని స్కాలర్‌‌తో  కేటుగాళ్లు చెప్పారు. తన ల్యాప్‌‌ టాప్‌‌, ఫోన్‌‌ను ఉగ్రవాదులు హ్యాక్‌‌  చేశారని సైబర్  నేరగాళ్లు బాధితుడిని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్‌‌ సెల్స్‌‌‌‌తో నీ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వారు హౌజ్ అరెస్ట్ చేస్తామంటున్నారని చెప్పి ఆరు రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు.

ఇలా అతనిని బెదిరించి  రూ.30 లక్షలను సైబర్  నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌‌డీ స్కాలర్‌‌.. సైబర్‌‌ క్రైమ్  పోలీసులకు  ఫిర్యాదు చేశారు. తర్వాత సజ్జనార్‌‌ను కలిసి జరిగిందంతా వివరించాడు. ఈ నేపథ్యంలో సజ్జనార్  ట్విటర్  వేదికగా స్పందించారు. ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులే మోసాలకు గురవడం బాధాకరమన్నారు.

డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ గానీ, ఐవీఆర్  కాల్స్ గానీ వస్తే వాటికి స్పందించవద్దని ఆయన సూచించారు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దన్నారు. డ్రగ్స్ కేసు, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని చెప్పారు. మోసపోతే సైబర్  క్రైమ్  హెల్ప్ లైన్  నంబర్ 1930కు ఫోన్ చేయాలని, లేదా స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.