హైదరాబాద్లో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరి నుంచి రూ.6.75 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్లో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరి నుంచి రూ.6.75 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.6.75 కోట్లు దోచుకున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించి, ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ లింకులతో ట్రేడింగ్ చేయించారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు.  బాధితులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు మణికొండ సెక్రటేరియెట్ కాలనీకి చెందిన లెనిన్ అనే వ్యాపారిని ఇటీవల ‘డీ2 హై నెట్ వర్క్’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. 

స్నేహ సర్ధా అనే పేరుతో చాటింగ్ చేశారు. https://iiflcapital.top అనే ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ లింక్ పంపి షేర్ మార్కెట్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయమని సూచించారు. జులై 9న మొదటి విడతగా రూ.12,000 పెట్టుబడి పెట్టిన లెనిన్‌‌‌‌‌‌‌‌కు 15% లాభం వచ్చినట్లు చూపించారు. అది నమ్మిన లెనిన్..45 రోజుల వ్యవధిలోనే రూ.3.61 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు.

 వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో రూ.27 కోట్ల లాభం కనిపించినా, డబ్బు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే వివిధ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ల పేరుతో మరింత డబ్బు కట్టమని ఒత్తిడి చేశారు. అనుమానం వచ్చిన లెనిన్ ఢిల్లీలోని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఆరా తీశాడు. మోసపోయినట్లు గుర్తించి మంగళవారం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)కి ఫిర్యాదు చేశాడు. 

సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ నుంచి రూ.3.14 కోట్లు

శేరిలింగంపల్లి ఆర్పీ దూబే కాలనీకి చెందిన కల్పన అనే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ను సైబర్ నేరగాళ్లు.. ‘జే7-లెగసీ ఎలైట్’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. మళ్లీ స్నేహ సర్ధా పేరుతోనే చాటింగ్ చేసి..ఫేక్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ లింక్ ద్వారా ట్రేడింగ్ చేయమని కల్పనకు సూచించారు. ఆగస్టు 1 నుంచి ట్రేడింగ్ ప్రారంభించిన కల్పన.. మొదటి విడతగా రూ.50 వేలు డిపాజిట్ చేసింది. 15% లాభం చూపించడంతో ఆమె నెల రోజుల వ్యవధిలో రూ.3.14 కోట్లు పెట్టుబడి పెట్టింది. 

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో రూ.23 కోట్ల లాభం కనిపించినా, విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే 10% కమీషన్, 3% ట్యాక్స్ చెల్లించాలని ఒత్తిడి చేశారు. మోసం గుర్తించిన కల్పన ఎన్సీఆర్పీ, టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేసింది. ఈ  రెండు ఫిర్యాదుల ఆధారంగా  సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. బాధితులు వెంటనే 1930 హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫేక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు, అనధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లపై జాగ్రత్తగా ఉండాలని, సెబి ఆమోదిత ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని సైబర్ సెక్యూరిటీ హెచ్చరించారు.