వరంగల్ కమిషనరేట్ పరిధిలో .. నెలకు వెయ్యి సైబర్ ఫ్రాడ్స్..!

వరంగల్ కమిషనరేట్ పరిధిలో .. నెలకు వెయ్యి సైబర్ ఫ్రాడ్స్..!
  • అమాయకుల ఖాతాలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు
  • రోజుకు సగటున 30 వరకు ఆన్ లైన్ మోసాలు 
  • రూ. లక్ష దాటిన కేసుల్లోనే ఎఫ్ఐఆర్ లు
  • ఏటా రూ.కోట్లు కాజేస్తున్న దుండగులు
  • కేసులు ఛేదించలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైబర్ ఫ్రాడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో రోజుకు ఒకటి, రెండు ఘటనలు బయటపడగా, ఇప్పడు కుప్పలు తెప్పలుగా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఓటీపీ, ఓఎల్​ఎక్స్​, గిఫ్ట్​ కూపన్, లింక్​ అంటూ మోసాలకు పాల్పడిన సైబర్​ కేటుగాళ్లు ఇప్పడు రూట్​ మార్చి ఇప్పుడు ఇన్​వెస్ట్ ​మెంట్స్, పార్ట్​ టైం జాబ్స్, టాస్క్​ల పేరున దాడులు చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్​లో రోజుకు సగటున 30 వరకు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ బయటపడుతుండగా, నెలకు వెయ్యి మంది వరకు మోసాల బారిన పడుతున్నారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జరిగే ఈ సైబర్ దాడులను ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్లు తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. 

ట్రెండింగ్ లో పెట్టుబడులు, టాస్క్​ల పేరుతో మోసం..

సైబర్ నేరగాళ్లు జనాల అమాయకత్వాన్ని క్యాష్​ చేసుకుంటున్నారు. ఏదో రకంగా స్మార్ట్ ఫోన్ యూజర్లతో కాంటాక్ట్​లోకి వచ్చి ఓటీపీలు, లింక్​లు, ఇన్​స్టాల్ చేసుకునే యాప్స్ ద్వారా వారి డేటానంతా తమ గుప్పిట్లోకి తీసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన దుండగులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు.

ఈ మధ్యకాలంలో సైబర్​ నేరగాళ్లు రూటు మార్చి ఇన్​వెస్ట్​మెంట్, టాస్క్​ల పేరున ఎక్కువ దోపిడీలకు పాల్పడుతున్నారు. మల్టీనేషనల్ కంపెనీల్లో పెట్టుబడులు, టాస్క్​ఇవ్వడం, డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్​ కట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి ఎక్కువగా చదువుకునే యువతనే బలవుతున్నారు. వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో ఈ ఏడాది మొత్తంగా 329 కేసుల్లో ఎఫ్​ఐఆర్​ కాగా, అందులో దాదాపు సగం కేసులు ఇన్​వెస్ట్​మెంట్, టాస్క్​ బేస్డ్​ ఫ్రాడ్సే ఉన్నాయి.

వేలల్లో కేసులు.., వందల్లో ఎఫ్​ఐఆర్​లు

వరంగల్ కమిషనరేట్​లో సైబర్ నేరాలు ఇటీవల ఎక్కువయ్యాయి. రోజుకు సగటున 30 వరకు సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నట్లు అధికారుల అంచనా. అంటే అన్నీ కలిపి నెలకు యావరేజ్ గా వెయ్యి వరకు మోసాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. కొంతమంది చిన్న అమౌంట్ కు ఫిర్యాదు చేయడమెందుకులే అని వదిలేస్తుండగా, మరికొందరు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నా పరువు పోతుందని ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో ఆఫీసర్ల లెక్కల్లో చాలా తక్కువ కేసులు కనిపిస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల దాడిలో రూ.వేల నుంచి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నవారు ఉంటుండగా, క్షేత్రస్థాయి ఇబ్బందుల దృష్ట్యా పోలీసులు రూ.లక్ష, అంతకంటే ఎక్కువ మోసం జరిగిన కేసుల్లోనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తున్నారు.

రికవరీ డల్..

జనాల సెల్ఫ్ మిస్టేక్స్, సైబర్ నేరగాళ్ల సైకలాజికల్ టెక్నిక్స్ తో ఆన్ లైన్ ఫ్రాడ్స్ వేగంగా పెరిగిపోతున్నాయి. ఐదేండ్లలో ఏకంగా వంద రెట్ల వరకు సైబర్​ నేరాలు పెరిగాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2020లో మొత్తంగా 99 సైబర్​ నేరాలు నమోదు కాగా,  రెండేండ్ల నుంచి ఏటా 3 వేలకు పైగా మోసాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో సైబర్ ఫ్రాడ్స్ జరుగుతుండగా, నమోదవుతున్న కేసుల్లో కనీసం పావు వంతు కూడా ట్రేస్​ కావడం లేదు. జనాల ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు వెంటవెంటనే అకౌంట్లు మారుస్తుండడంతో మనీ రికవరీ చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది.

కాగా, తెలిసీతెలియక ఆన్​లైన్​లో డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో ఆవుల దిలీప్(17) ఆన్లైన్​ ట్రేడింగ్​కు అలవాటు పడి రూ.1.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. చివరకు అప్పు తీర్చేదారి లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మసాగర్ మండలం మలక్​పల్లిలో కూడా రామకృష్ణారెడ్డి (26) కూడా పెద్ద ఎత్తున నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.   

సెల్ఫ్ మిస్టెక్స్ చేయొద్దు

జనాల సెల్ఫ్ మిస్టేక్స్ వల్లనే సైబర్ నేరాలు ఎక్కువవుతు న్నాయి. గుర్తు తెలియని లింక్స్ ఓపెన్​ చేయడం, ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డు సమాచారం ఆన్​లైన్ సైట్లలో షేర్ చేసుకోవడం కూడా సైబర్ నేరాలకు ఆస్కారమిస్తుంది. కాబట్టి జనాలు అవగాహనతో మెలగాలి. ఒకవేళ ఎవరైనా సైబర్​ నేరాల ఫ్రాడ్​ బారిన పడితే వెంటనే 1930 నెంబర్​కు కాల్ చేయాలి. లేదంటే నేషనల్ సైబర్ క్రైమ్స్ సైట్​లో ఫిర్యాదు చేయొచ్చు. కంప్లైంట్ అందితే వెంటనే అమౌంట్ రికవరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

విజయ్​ కుమార్, సైబర్​ క్రైమ్స్ ఏసీపీ, వరంగల్​