పెట్టుబడి పేరుతో మోసం .. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.8 లక్షలు వసూలు

పెట్టుబడి పేరుతో మోసం .. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.8 లక్షలు వసూలు

మెట్‌పల్లి, వెలుగు : పెట్టుబడికి డబుల్‌ ఇస్తామంటూ, ఆన్‌లైన్‌ బిజినెస్‌ అంటూ సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 8 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన మెట్‌పల్లి పట్టణంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... మెట్‌పల్లికి చెందిన ఎం. రాజ్‌కుమార్‌ ఇటీవల ఓ సోషల్‌ మీడియా గ్రూప్‌లో వచ్చిన లింక్‌ ద్వారా సీసీఈహెచ్‌డీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఈ యాప్ ద్వారా మొదట రూ.700 పెట్టుబడి పెట్టాడు. దీంతో రూ. 1400 వచ్చాయి. ఇలా పలుమార్లు పెట్టుబడి పెట్టగా రెట్టింపు డబ్బులు వచ్చాయి. దీంతో నిజమేనని నమ్మిన రాజ్‌కుమార్‌ రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 

తర్వాత ఆ డబ్బులు విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయాయని గ్రహించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే పట్టణానికి చెందిన ఎం.రాహుల్‌కుమార్‌ ఆన్‌లైన్‌ బిజినెస్‌ కోసమంటూ ఓ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ పూర్తి చేశాక రిజిస్ట్రేషన్‌ ఫీజు పేరిట జనవరి 9న రూ.49,500 వారు చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్‌ పేరిట ఈ నెల 13న రూ. 5 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ప్రాసెస్‌ పూర్తి కావడానికి మరో రూ. 8 లక్షలు పంపాలని కోరడంతో మోసపోయానని గ్రహించిన రాహుల్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు.