ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

ఎస్​ఓటీ, మియాపూర్​ పోలీసుల జాయింట్ఆపరేషన్​ 

నిందితుల్లో మేఘాలయ ఎంజీ వర్సిటీ మాజీ డైరెక్టర్​, క్లర్క్​

శేరిలింగంపల్లి, వెలుగు : హైదరాబాద్ లో కొన్నేండ్లుగా ఫేక్​ డిగ్రీ సర్టిఫికెట్ల దందా చేస్తూ కోట్లు దండుకుంటున్న  ముఠాను సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్​ పరిధిలోని మెట్టుగూడ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఓ బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్​ ఎస్​ఓటీ, మియాపూర్​ పోలీసులు జాయింట్ ఆపరేషన్​చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఒక మహిళ సహా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈదందాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘాలయలోని  మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మిల్లీగోయెల్(52)​ గతంలో డైరెక్టర్​గా పని చేశాడు. ఇతనితో పాటు అక్కడే  శివాని క్లర్క్​గా పని చేసింది. వీరికి ఢిల్లీలో ఏసీకే మేనేజ్​మెంట్ ఇన్​స్టిట్యూట్​నిర్వహిస్తున్న దినేశ్​సింగ్​(33), అఖిలేశ్ సేహ్వాల్​(41), తాజిందర్​సింగ్​(36)తో పరిచయం ఏర్పడింది.

వీరితో పాటు సికింద్రాబాద్ మెట్టుగూడలో ఎస్​ఎస్​ డిస్టెన్స్​ఎడ్యుకేషన్ సెంటర్​ నిర్వాహకుడు గరికపాటి వెంకటభాస్కర సత్యనారాయణశర్మ(49), రిసెప్షనిస్టుగా పని చేస్తున్న సింగారపు సుజాత(38), గచ్చిబౌలి టీసీఎస్​లో సాఫ్ట్ వేర్​ డెవలపర్​గా పని చేస్తున్న గీరుకు ప్రేమ్​కుమార్​(29) ముఠాగా ఏర్పడ్డారు. వీరు డిస్టెన్స్​ఎడ్యుకేషన్​ పేరుతో ఫేక్​ సర్టిఫికెట్లు ఇస్తూ రూ. కోట్లు  వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు  దాదాపు 430 ఫేక్​సర్టిఫికెట్లు విక్రయించిన ఈ ముఠా ఒక్కొక్క స్టూడెంట్​ నుంచి   రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు వసూలు చేశారు. 

ఏపీ విద్యార్థి ఫిర్యాదుతో..

ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన షేక్​ఖాజా నయాబ్​రసూల్​నాలుగు నెలల కింద నగరానికి వచ్చి మియాపూర్​లో ఉంటున్నాడు. ఇంటర్​పూర్తి చేసిన ఇతను డిస్టెన్స్​ఎడ్యుకేషన్​ ద్వారా డిగ్రీ చేయాలనుకున్నాడు. అంతకుముందే పరిచయం ఉన్న  ప్రేమ్​కుమార్​ను సలహా కోరాడు. ప్రేమ్​కుమార్​అతనికి సత్యనారాయణశర్మని  పరిచయం చేశాడు. బీఎస్సీ(ఐటీ)  డిగ్రీ చదవాలనుకుంటున్నట్టు రసూల్​ చెప్పగా  మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ద్వారా ఆన్​లైన్​ పరీక్ష రాయించి సింగిల్​సిట్టింగ్​లో సర్టిఫికెట్​ ఇప్పిస్తానని శర్మ నమ్మబలికాడు. పాస్​పోర్ట్​ఫొటో, ఇంటర్​ మెమో, ఐడీ ప్రూఫ్​తో పాటు రూ. 2.10 లక్షలు ఫీజు  చెల్లించాలన్నాడు.  రసూల్​రూ. 2.07 లక్షలు ఫీజు  ప్రేమ్​కుమార్​కు ఫోన్​పే ద్వారా చెల్లించాడు.  

కొన్ని రోజులకు రసూల్​వాట్సాప్​కు ఎంజీ యూనివర్సిటీ నుంచి 2014–15, 2015–16 అకడమిక్​ఇయర్స్​కు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయి. వీటిని వెరిఫై చేసిన రసూల్​ అవి నకిలీ సర్టిఫికెట్లని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఎస్​ఓటీ, మియాపూర్​ పోలీసులు  ప్రేమ్​కుమార్, శర్మలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది నిందితుల్లో మిల్లీగోయెల్​, శివాని పరారీలో ఉన్నారు. మిగిలిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి రూ. 50 వేల నగదు, 157 మార్క్స్ మెమోలు, 9 ల్యాప్​టాప్​లు, సీపీయూ, ఫేక్​ స్టాంప్స్​, ఎంజీ యూనివర్సిటీ ఎన్వలప్స్​, ఐడీ కార్డ్స్​లెటర్​ప్యాడ్స్​, బిల్​బుక్స్​స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ. 37, 45, 345  సీజ్​ చేశారు. పరారీలో ఉన్న  ఇద్దరి  కోసం గాలిస్తున్నారు.