ఐఏఎస్,ఐపీఎస్ ఫోటోలను డీపీలు పెట్టి...

ఐఏఎస్,ఐపీఎస్ ఫోటోలను డీపీలు పెట్టి...
  • ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: ఉన్నతాధికారుల ఫోటోలు వాట్సాప్ డీపీలు పెట్టి డబ్బులు కాజేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. డీజీపీతో పాటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోటోలతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐఏఎస్ దివ్య దేవరాజ్, అరవింద్కుమార్ పేర్లతో దాదాపు లక్షా 25వేల రూపాయలు వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసులు సైబర్ టీమ్ ను అప్రమత్తం చేశారు. బాధితులను మోసం చేసిన తీరును పరిశీలించి..వారి నుండి సేకరించిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు కర్నాటకలో తీగ దొరికింది.

దర్యాప్తు మరింత ముమ్మరం చేయగా బెంగళూరు కు చెందిన రాఘవ అప్పు, బీహార్ కు చెందిన ఆనంద్ కుమార్ ఇద్దరు కలిసి రాజస్థాన్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నట్లు  గుర్తించారు. దేశం వెలుపల నైజీరియన్లతో టచ్ లో ఉంటూ అక్కడి నుండి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు జడ్జి గారి ఫోటోలు పెట్టి.. అర్జెంటుగా డబ్బు కావాలి.. అంటూ.. మెసేజీలు పెడుతున్నారు. అయితే నేరుగా డబ్బులు అడగకుండా.. అమెజాన్ గిఫ్ట్ కార్డు రీచార్జ్ చేయాలంటూ.. మెసేజీలతోపాటు గిఫ్ట్ కార్డు లింకులు పంపుతున్నారు. తెలియని వాళ్లు.. అమాయకులు వెంటనే రీచార్జ్ చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. డీజీపీ ఫోటో డీపీగా ఉన్న కేసు విచారణ కొనసాగుతోందని ఆయన వివరించారు.