ఇన్వెస్ట్ మెంట్, గోల్డ్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు

ఇన్వెస్ట్ మెంట్, గోల్డ్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు

ఇన్వెస్ట్ మెంట్, గోల్డ్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తులకు కుచ్చుటోపీ పెట్టారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి కోటిన్నర వరకు దోపిడీ చేశారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఒకరు రైల్వే అధికారి ఉన్నారు. 

అమీర్ పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఆన్ లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. యూ ట్యూబ్ లో లైక్స్, షేర్ లు కొడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ ఎరవేశారు. ఇదంతా నిజమని నమ్మి.. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేశాడు సదరు వ్యక్తి. మొదట్లో బాధితుడికి కొంత మొత్తంలో డబ్బులు పంపించారు. మొదట సైబర్ నేరగాళ్లు డబ్బులు చెల్లించడంతో బాధిత వ్యక్తి తన వద్దనున్న రూ.70 లక్షలను ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించాడు. 

మరో కేసులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పని చేస్తున్న ఓ అధికారికి గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ మెంట్ పేరిట సైబర్ నేరగాళ్లు వల విసిరారు. మొదట రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసిన అధికారికి రూ.2 లక్షలను సైబర్ నేరగాళ్లు వెంటనే చెల్లించారు. నమ్మకం కుదిరిన సదరు అధికారి పలు దఫాలుగా రూ.73 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించి ఎలాంటి లాభాలు ఇవ్వకపోగా.. మరికొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు ఒత్తిడి పెంచారు. దీంతో ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. 

ఈ రెండు ఘటనల్లోనూ బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.